సాక్షి, హైదరాబాద్: చేపల ధరలు కొండెక్కికూర్చున్నాయి. కరోనా కారణంగా గత కొద్ది రోజులనుంచి ఎక్కడా కనిపించని చేపలు బుధవారం అక్కడక్కడా విక్రయానికి వచ్చాయి. అయితే ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. రవ్వ, బొచ్చ, బంగారుతీగ చేపల ధరలు కిలో రూ. 200 దాటిపోయాయి. కొర్రమీను ఏకంగా 700 నుంచి 800 వరకు పలికింది. ఏపీ నుంచి చేపలు వస్తుండటం, తెలంగాణ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవడంతో ధరలు ఇలా పెరిగిపోయాయని వ్యాపారులు అంటున్నారు. ధరలను అందుబాటులో ఉంచుతామని చెబుతున్న అధికారులు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. అధిక ధరలను కట్టడిచేసి చేపలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

త్వరలో ధరలు అందుబాటులోకి..
‘కరోనా నేపథ్యంలో తెలంగాణ మత్స్యకారులు చేపలు పట్టడంలేదు. దీంతో డిమాండ్ కారణంగా కొంత మేర ధరలు పెరిగాయి. ఆదివారంలోగా ధరలు తగ్గుముఖం పడతాయి. మంత్రి, కమిషనర్ ఆదేశాల మేరకు కరోనా నేపథ్యంలో పాటించాల్సిన నిబంధనలు, ధరలపై హైదరాబాద్‌లో మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేశాం. ధరలపై సుదీర్ఘంగా చర్చించాం’అని అధికారులు తెలిపారు. కాగా, ఏపీ నుంచి సరుకులు తీసుకొచ్చే వాహనాలు దొరకడం లేదని, రవాణా భారం ఖర్చు చేపల ధరలతో కలిపి అమ్మాల్సి వస్తోందని విక్రయదారులు అంటున్నారు.


