ఖమ్మంలో కరోనా కలకలం

Coronavirus Feared Out In Khammam District - Sakshi

సాక్షి, కొత్తగూడెం : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం జిల్లాలోనూ కనిపిస్తోంది. అశ్వాపురానికి చెందిన ఓ యువతి(24) ఇటలీలో ఎంఎస్‌ చదువుతోంది. అక్కడ కరోనా వైరస్‌ ప్రభావంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో ఈనెల 7న ఆమె స్వగ్రామానికి వచ్చింది. రెండు రోజుల తర్వాత జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ మణుగూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందింది. జ్వరం ఎంతకూ తగ్గకపోవడంతో ఈనెల 10వ తేదీన భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చింది. అయితే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆ యువతిని ఈనెల 11న ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించిన అక్కడి వైద్యులు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారించారు. 

కొత్తగూడెం, భద్రాచలంలో  ఐసోలేషన్‌ వార్డులు..
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో కొందరికి కరోనా లక్షణాలున్నాయని ఇటీవల సోషల్‌ మీడియాల్లో ప్రచారం జరిగింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు మాస్క్‌లు ధరించారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఎవరికీ ఈ వైరస్‌ లేదని వైద్యారోగ్య శాఖ అధికారులు ఓ వైపు ప్రకటిస్తూనే.. మరోవైపున కరోనాపై వైద్యశాఖ సిబ్బందికి, ల్యాబ్‌ టెక్నీషియన్లకు, ఫార్మసిస్టులకు శిక్షణ ఇచ్చారు. కొత్తగూడెం, భద్రాచలం ఏరియా ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశారు.

కరోనా వైరస్‌ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య, విద్యాశాఖ అధికారులకు మాతా, శిశు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్‌ సుధీర గత మంగళవారం హైదరాబాద్‌ నుంచి శాటిలైట్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఫిబ్రవరి 20 తర్వాత చైనా, ఇటలీ, అమెరికా తదితర దేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ భాస్కర్‌ కూడా పీహెచ్‌సీ వైద్యాధికారులకు సూచించారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వారి వివరాలు సేకరించాలన్నారు. అనుమానితులు ఉంటే హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు.  

అశ్వాపురంలో అప్రమత్తం..
అశ్వాపురం యువతికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో స్థానిక సర్పంచ్‌ శారద ఆధ్వర్యంలో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేశారు. అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, డీఎంఅండ్‌హెచ్‌ఓ భాస్కర్‌నాయక్‌ అశ్వాపురం చేరుకుని యువతి కుటుంబ సభ్యులను హైదరాబాద్‌ తరలించారు. తహసీల్దార్‌ భగవాన్‌రెడ్డి, స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి మణికంఠారెడ్డి ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, వైద్యాధికారులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top