కష్టాల కడలిలో కాంట్రాక్టు ఉద్యోగులు

Contract employees in problems - Sakshi

మూడు నెలలుగా అందని వేతనాలు

మార్చితోనే ముగిసిన కాంట్రాక్టు గడువు

ఒప్పందాన్ని పునరుద్ధరించని ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: సర్కారు ఖజానాకు ఆదాయం సమకూర్చే ఎక్సైజ్, కమర్షియల్‌ ట్యాక్స్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్, ఆర్టీసీ తదితర శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు మూడు నెలలుగా వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో మొత్తంగా 40 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలోనే ఈ ఉద్యోగుల కాంట్రాక్టు గడువు ముగిసిపోయింది.

నిబంధనల ప్రకారం ముగింపు గడువుకు ముందుగానే కాంట్రాక్టును తిరిగి పునరుద్ధరించాలి. కానీ మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కాంట్రాక్టు గడువును పొడిగించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది కొలువు ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయం నెలకొని ఉంది. కాంట్రాక్టును వెంటనే పునరుద్ధరించి, పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలని ప్రతి ఉద్యోగికి కనీసం రూ.12,000 వేతనం చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  

ఒక్కో చోట ఒక్కో విధానం
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమల్లోకి తెచ్చిన ఈ విధానం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. తెలంగాణ రాక పూర్వం 6,500 కనీస వేతనం ఇచ్చి, ఉద్యోగులతో ప్రభుత్వం అధికారికంగా వెట్టిచాకిరీ చేయించుకునేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు నెలకు కనిష్టంగా రూ.12,000, గరిష్టంగా రూ.17,500 చొప్పున వేతనం ఇవ్వాల్సి ఉండగా.. ఒక్కోచోట ఒక్కొక్క విధానాన్ని అమలు చేస్తున్నారు.

దేవాదాయ ధర్మాదాయ, ఆర్టీసీ, ఫారెస్టు శాఖల్లో ఇప్పటికీ రూ.7,500 వేతనాలే చెల్లిస్తున్నారని ఫిర్యాదులున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంగా కాంట్రాక్టు ఒప్పందం కింద టైగర్‌ ట్రాకర్లుగా పనిచేస్తున్న చెంచుల వేతనాలను అక్కడి ఫారెస్టు అధికారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో అచ్చంపేట సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేసిన ఓ అధికారి కొంతమంది టైగర్‌ ట్రాకర్లకు వేతనాలు ఇవ్వకుండా మొత్తం తానే తీసుకున్నాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఫారెస్టు ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top