
టాలీవుడ్ సినీ కార్మికులకు ఫిల్మ్ ఛాంబర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల చర్చలు సఫలం కావడంతో కార్మికులకు వేతనాల పెంచుతున్నట్లు ప్రకటించింది. నిర్మాతలు, సినీ కార్మిక సంఘాలతో కుదిరిన ఒప్పందం ప్రకారం 22.5 శాతం వేతనాలు పెంచుతూ నిర్ణయించినట్లు ఫిల్మ్ ఛాంబర్ వెల్లడించింది. ఈనెల 22 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 22 వరకు 15 శాతం పెంపును అమలు చేయాలని నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సినీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సినీ కార్మికుల సంఘాల వారీగా వేతనాలను పెంచుతూ నిర్మాతలకు లేఖలు రాసింది. జూనియర్ ఆర్టిస్టులను మూడు విభాగాలుగా విభజించారు. ఏ కేటగిరిలో రూ.1,420.. బీ కేటగిరిలో రూ.1,175.. సీ కేటగిరిలో రూ.930 ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఉదయం టిఫిన్ పెట్టకుంటే రూ.70, మధ్యాహ్నం భోజనం ఇవ్వకపోతే రూ.100 అదనంగా ఇవ్వాలని ప్రకటించారు. అలాగే ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్‌కు రూ.1,470.. హఫ్ కాల్ షీట్‌కు రూ.735 చెల్లించనున్నారు.
కాల్ షీట్ సమయం 4 గంటలు దాటిన తర్వాత మాత్రమే పూర్తి వేతనం చెల్లిస్తారని జీతాలు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు. పని నిబంధనలకు సంబంధించి ఇతర సమస్యలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కమిటీకి తెలియజేయాలని ఆయన సూచించారు. ఇతర అన్ని వర్కింగ్ కండీషన్స్, అలవెన్సులు 2022లో కుదిరిన ఒప్పందం ప్రకారమే అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.