‘చే’ జారొద్దు!

Congress strategy in the election of MPP And ZP Chairperson - Sakshi

ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యూహం

జిల్లాల వారీగా పరిశీలకుల నియామకం..

టీపీసీసీ సమావేశంలో నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: మండల, జిల్లా పరిషత్‌ అధ్యక్ష పీఠాలకు ఈ నెల 7, 8 తేదీల్లో జరగనున్న ఎన్నికల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని టీపీసీసీ నిర్ణయించింది. మెజార్టీ స్థానాల్లో తమ సభ్యులు గెలిచే అవకాశం ఉన్నందున అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యే వర కు జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు గెలిచిన సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ, సమన్వయం చేసుకుంటూ సాగాలని పార్టీ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. స్థానిక ఎన్నికల ఫలితాలపై గురువారం సాయంత్రం గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్య నేతలు, డీసీసీ అధ్యక్షులతో ఉత్తమ్‌ సమావేశమయ్యారు.

ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికల విషయంలో ఉన్న సాంకేతిక అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా విప్‌ జారీ చేసే అధికారంతో పాటు విప్‌ను ఉల్లంఘిస్తే సదరు సభ్యుడిపై వేటు పడే అవకాశం ఉండ టంతో విప్‌ల జారీని పకడ్బందీగా పూర్తి చేసి రిటర్నింగ్‌ అధికారులకు అందజేయాలని నిర్ణయించారు. మండల, జిల్లా పరిషత్‌ అధ్యక్ష ఎన్నికల్లో విప్‌ జారీ చేసే అధికారాన్ని జిల్లా కాంగ్రెస్‌ కమిటీలకు ఉత్తమ్‌ అప్పగించారు. జూన్‌ 2న అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. జూన్‌ 4న జరిగే కౌంటింగ్‌ ప్రక్రియ గురించి స్థానిక నేతలకు అవగాహన కల్పించాలని, ఎక్కడకూడా టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండేలా స్థానిక నాయకత్వాలను అప్రమత్తం చేయాలని చెప్పారు.

కౌంటింగ్‌ పూర్తయ్యాక గెలిచిన సభ్యులతో 5, 6 తేదీల్లో సమావేశాలు నిర్వహించి, అధ్యక్ష ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెట్టాలన్నారు. ఇందుకు 25 జిల్లాలకు టీపీసీసీ నుంచి పరిశీలకులను నియమించారు. ఈ పరిశీలకులే కౌంటింగ్‌ నుంచి చైర్‌పర్సన్‌ ఎన్నికల వరకు ఆయా జిల్లాల్లో పూర్తి బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు. రాహుల్‌ గాంధీనే ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని సమావేశంలో తీర్మానం చేశా రు. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జె.కుసుమకుమార్‌తో పాటు పలువురు సీనియర్‌ నేతలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

పరిశీలకులు వీరే..
ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (సూర్యాపేట), మల్లు భట్టి విక్రమార్క (ఖమ్మం), కె.జానారెడ్డి (నల్లగొండ), షబ్బీర్‌అలీ (కామారెడ్డి), రేవంత్‌రెడ్డి (మేడ్చల్‌), పొన్నం ప్రభాకర్‌ (కరీంనగర్‌), జె.కుసుమకుమార్‌ (మెదక్‌), జి.చిన్నారెడ్డి (వనపర్తి), సీహెచ్‌ వంశీచందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), సంపత్‌కుమార్‌ (గద్వాల), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి), టి.జీవన్‌రెడ్డి (జగిత్యాల), డి.శ్రీధర్‌బాబు (భూపాలపల్లి), సీతక్క (ములుగు), జగ్గారెడ్డి (సంగారెడ్డి), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (వికారాబాద్‌), మల్లురవి (నాగర్‌కర్నూల్‌), పి.సుదర్శ¯న్‌రెడ్డి (నిజామాబాద్‌), ఎ.మహేశ్వర్‌రెడ్డి (ఆదిలాబాద్‌), కె.ప్రేంసాగర్‌రావు (మంచిర్యాల), దొంతి మాధవరెడ్డి (మహబూబాబాద్‌), సీహెచ్‌ విజయరమణారావు (పెద్దపల్లి), కె.లక్ష్మారెడ్డి (రంగారెడ్డి), పాల్వాయి హరీశ్‌ (ఆసిఫాబాద్‌). మరో ఎనిమిది జిల్లాలకు పరిశీలకులను నేడో, రేపో ప్రకటించనున్నారు.

కోటి మంది తరఫున అడుగుతున్నాం: ఉత్తమ్‌
‘తెలంగాణలోని కోటి మంది కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల తరఫున అడుగుతున్నాం. రాహుల్‌ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలి’ అని ఉత్తమ్‌ కోరారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీనే కొనసాగాలని కోరుతూ గురు వారం గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్, మాజీ ఎంపీ వి.హనుమంతరావులు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన ఉత్తమ్‌ మాట్లాడుతూ, రాహుల్‌ అహర్నిశలు పార్టీ కోసం కష్టపడ్డారని చెప్పారు.

ఆయన ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలన్నదే తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఏకగ్రీవ నిర్ణయమని ఉత్తమ్‌ చెప్పారు. అనంతరం ఆయన కిషన్, వీహెచ్‌లకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్‌అలీ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డి, మల్లు రవి, మల్‌రెడ్డి రంగారెడ్డి, మదన్‌మోహన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top