చుట్టపు చూపు..

Congress Senior Leader Ponnala Lakshmaiah Political Silence Telangana - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య రాజకీయ ప్రస్తానంపై చర్చ జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన పొన్నాల.. కొన్ని నెలల నుంచి పూర్తిగా మౌనముద్రలో ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాలను శాసిం చిన ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే పెద్ద కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. చివరికి తన సొంత నియోజకవర్గం జనగామకు కూడా అరుదుగానే వస్తున్నారు. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య రాజకీయ పయనం ఎటు వైపు అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

అప్పట్లో అన్నీ తానై..
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 వరకు పొన్నాల లక్ష్మయ్య ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాలను పూర్తిస్థాయిలో శాసించారు. రెడ్యానాయక్, కొండా సురేఖ, బస్వరాజు సారయ్యలు మంత్రులుగా పనిచేసినా... కాంగ్రెస్‌ వ్యవహారాలన్నీ పూర్తిగా పొన్నాల నిర్ణయంతోనే జరిగాయి. 2014 సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అ«ధ్యక్షుడిగా నియమితులయ్యారు. కీలకమైన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సారథిగా వ్యవహరించారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయంతో పొన్నాల రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో టీపీసీసీ చీఫ్‌ పదవిని వదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 

2019 ఎన్నికలకు ఎవరు దిక్కు..!
గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో కీలకంగా పనిచేసినా, వరంగల్‌ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లోనూ పొన్నాల తన ప్రభావాన్ని కొనసాగించారు. మరో వైపు కాంగ్రెస్‌లో అప్పటి వరకు కీలకంగా పనిచేసిన డీఎస్‌.రెడ్యానాయక్, కొండా సురేఖ, బస్వరాజు సారయ్యలు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌లో కీలక నేతలు లేని పరిస్థితి నెలకొంది. అయితే 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు ఎవరనే అంశంపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. కష్టకాలంలో నాయకత్వం వహించి పార్టీని నడిపించాల్సిన పొన్నాల దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సిన సందర్భాలలో పొన్నాల తీరు అసంతృప్తిగా ఉంటోందని అంటున్నారు. స్వయంగా కార్యక్రమాలను నిర్వహించడం విషయం ఎలా ఉన్నా... కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాల ప్రకారం జరిగే కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారని చర్చించుకుంటున్నారు.

  •    
     పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గమైన జనగామకు సైతం చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో జనగామ జిల్లా ఏర్పాటు చేయాలంటూ ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగిన సమయంలోనూ పొన్నాల కీలకంగా వ్యవహరించలేదనే అభిప్రాయం కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉంది. ఆ తర్వాత అదే వైఖరి కొనసాగుతోందని అంటున్నారు.
  •      ప్రజాచైతన్య యాత్ర పేరుతో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. పాలకుర్తి, నర్సంపేట, మొగుళ్లపల్లి సభలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పుతోపాటు పలు ఇతర సెగ్మెంట్లలో ఫర్వాలేదనిపించేలా ఈ యాత్ర జరిగింది. ఈ పన్నెండు నియోజకవర్గాల్లో ఏ ఒక్క చోట పొన్నాల పాల్గొనలేదు. రాష్ట్ర నాయకత్వం అంతా వరంగల్‌కు తరలివచ్చి ‘కాగ్‌ అద్దంలో కేసీఆర్‌ అబద్దాలు’ పేరుతో నిర్వహించిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు దూరంగా ఉన్నారు. 
  •      పొన్నాల ప్రధాన అనుచరుడిగా ముద్రపడిన నాయిని రాజేందర్‌రెడ్డి ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వచ్చే సార్వ త్రిక ఎన్నికల్లో వరంగల్‌ పశ్చిమ నుంచి పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. దీంతో వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలో డివి జన్లలో పాదయాత్రను ప్రారంభించారు. గత వారం రోజులుగా పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రను పురస్కరించుకుని నాయినిపై టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. అధికార పార్టీ ఎదురుదాడిలోనూ యాత్ర జరుగుతున్నా సీనియర్‌ నేత పొన్నాల కన్నెత్తి చూడడం లేదని కాంగ్రెస్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top