అప్పుడే ఆనందం.. అంతలోనే ఆవిరి

Congress Municipal Leaders Jump To TRS - Sakshi

‘గులాబీ’ గూటికి చేరిన కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌

లోక్‌సభ ఎన్నికల ముందు ఎమ్మెల్యే గంగుల స్కెచ్‌

కౌన్సిల్‌లో మూడుకు పడిపోయిన కాంగ్రెస్‌ బలం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి ఘన విజయం సాధించిన ఆనందంలో ఉండగానే.. కరీంనగర్‌ కార్పొరేషన్‌లోని ఆ పార్టీ కార్పొరేటర్లు షాకిచ్చారు. కౌన్సిల్‌లో కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆకుల ప్రకాశ్‌తో పాటు కార్పొరేటర్లు గందె మాధవి, సరిళ్ల రాజకుమారి, ఉమాపతి, చాడగొండ కవిత ఆ పార్టీని వీడి బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి తోడు మాజీ కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి గందె మహేశ్, యువజన కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి సహా పలువురు నాయకులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నేతృత్వంలో ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ సమక్షాన టీఆర్‌ఎస్‌లో చేరడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామం కరీంనగర్‌ నగర కాంగ్రెస్‌ శిబిరంలో కలకలం రేపింది. కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ స్వయంగా కార్పొరేటర్లు పార్టీని వీడకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

గత శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన గంగుల కమలాకర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై 14వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. మతపరమైన భావోద్వేగాలు ఈ ఎన్నికను ప్రభావితం చేయగా.. నువ్వా, నేనా అన్న రీతిలో పోరు సాగింది. కేవలం 14వేల ఓట్ల తేడాతో గెలవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలాకర్‌ పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 50 డివిజన్లలో మైనారిటీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు పోగా మిగతా డివిజన్లలో టీఆర్‌ఎస్‌ బలం పెంచేందుకు పావులు కదిపారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌ కార్పొరేటర్లను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. వచ్చే మునిసిపల్‌ ఎన్నికల్లో టికెట్లు పొందేందుకు తమ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న డివిజన్లలో ఇతర పార్టీల వారికి అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్‌ నుంచి వచ్చి చేరే కార్పొరేటర్లకు టీఆర్‌ఎస్‌ తరఫున సీటిచ్చినా ఇబ్బంది లేదనుకున్న డివిజన్ల నుంచి కార్పొరేటర్లను లాగేశారు. కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆకుల ప్రకాశ్‌ తొలుత పార్టీకి రాజీనామా చేయగా, మిగతా కార్పొరేటర్లు కూడా పార్టీని వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ స్వయంగా రంగంలోకి దిగి కార్పొరేటర్లు కాంగ్రెస్‌ను వీడకుండా ప్రయత్నాలు చేశారని సమాచారం. అయితే అప్పటికే వారు నిర్ణయం తీసుకోవడంతో.. బుధవారం ఎంపీ అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

మిగిలింది ముగ్గురే...
కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ ప్రకాశ్, మరో నలుగురు కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో చేరడంతో కౌన్సిల్‌లో కాంగ్రెస్‌ బలం మూడుకు పడిపోయింది. 2014 మునిసిపల్‌ ఎన్నికల్లో మేయర్‌ పదవిని పోగొట్టుకుని 14 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైన విషయం విదితమే. ఆ తర్వాత కొద్దికాలానికి 14 మందిలో ఆరుగురు కార్పొరేటర్లు, టీడీపీ, ఇండిపెండెంట్లతో పాటు గులాబీ గూటికే చేరారు. ఇక మిగిలిన 8 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లలో బుధవారం ఐదుగురు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీకి కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలినట్లయిది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top