సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ సీపీ గౌస్ ఆలంకు కోపమొచ్చింది. తన కిందిస్థాయి సిబ్బంది విషయంలో చర్యలు తీసుకుంటుంటే రాజకీయ నేతలు అడ్డుపడటంపై తీవ్ర అసహనానికి గురయ్యారు. ఉన్నతాధికారులకు చెప్పి సెలవుపై వెళ్లిపోవడం డిపార్ట్‌మెంట్‌లో చర్చనీయాంశంగా మారింది. డిపార్ట్‌మెంట్ అంతర్గత వ్యవహారంలో రాజకీయ జోక్యంతో కమిషనరేట్‌లో సీపీ.. వ్యవహారానికి కేంద్రబిందువుగా నిలిచిన ఎస్సై నలిగిపోతున్నారు. సెలవుపై వెళ్లిన సీపీ మళ్లీ వస్తారా..? లేక ఆయనపై బదిలీ వేటు వేస్తారా..? అనే విషయం హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో ఇటీవల ఓ ఐఏఎస్ అధికారి విషయంలో సాగిన ప్రచారం దుమారం రేపిన విషయం మరువకముందే మరో సివిల్ సర్వెంట్ రాజకీయ నేతల కారణంగా మనస్తాపానికి గురవడం గమనార్హం.
అసలేం జరిగింది?
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ఓ స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా ఉన్న ఎస్సైపై ఫిర్యాదులు రావడంతో సీపీ విచారణకు ఆదేశించారు. ఎస్సైకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకనప్పటికీ.. క్రమశిక్షణ ఉల్లంఘన కింద అటాచ్ చేసేందుకు సీపీ సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఓ అధికారపార్టీ నేత తాను పోస్టింగ్ ఇప్పించుకున్న ఎస్సైపై చర్యలు తీసుకోవద్దని హుకూం జారీ చేశారు. నొచ్చుకున్న సీపీ ఎస్సైని అటాచ్ చేశారు. ఇది తెలిసిన నేత.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద దిక్కు అయిన తూర్పు నేతను కలిశారు. ఎస్సైపై చర్యల విషయంలో సీపీకి.. డీజీపీకి ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమ అంతర్గత విషయంలో సిబ్బందిపై చర్యలు తీసుకుంటుంటే అంతమంది అడ్డుపడటంపై సీపీ తీవ్రస్థాయిలో నొచ్చుకున్నారు. ఎస్సైని సస్పెండ్ చేసి సెలవుపై వెళ్లిపోయారు. తన అటాచ్‌మెంట్ విషయంలో రాజకీయ నేతలు జోక్యం చేసుకుని సస్పెండ్ అయ్యేలా చేయడంపై ఎస్సై మదనపడుతున్నారు. తనకు మద్దతుగా వచ్చి ఇప్పుడు తన కెరీర్‌నే ప్రమాదంలో పడేసిన నేతల తీరును చూసి ఎస్సై వణికిపోతున్నారు.
డిపార్ట్‌మెంట్‌లో జోరుగా చర్చ
అంతర్గత సిబ్బందిని క్రమశిక్షణలో ఉంచాలనుకున్న సీపీ విధులకు అడ్డు తగిలిన నేత అంతటితో ఆగి ఉంటే వ్యవహారం ఇంతదూరం వచ్చి ఉండేది కాదు. తన మాట కాదన్నాడన్న అహంతో పెద్దనేత వద్దకు వెళ్లి సీపీపై ఫిర్యాదు చేయడం.. ఆయన సీరియస్ అవడంతో ఎస్సై సస్పెన్షన్‌కు దారి తీసింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌లో జోరుగా చర్చ సాగుతోంది. తమ విషయాల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకుని, విషయాన్ని పెద్దది చేయడం నేతలకు తగదని హితవు పలుకుతున్నారు. అటాచ్‌మెంట్‌తో పోయే వ్యవహారాన్ని సస్పెన్షన్ వరకు తీసుకొచ్చి ఎస్సై భవిష్యత్తును గందరగోళంలో పడేసిన రాజకీయ నేతలపై మండిపడుతున్నారు. రాజకీయ జోక్యంతో ఇటీవల ఐఏఎస్ అధికారి, తాజాగా కరీంనగర్ సీపీ మనస్తాపానికి గురైన తీరును చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


