alam
-
లాయర్ హత్య కేసు.. ఆలంఖాన్ సహా ఐదుగురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రాజకీయ నేత ఆలంఖాన్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన తండ్రీ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మొహిజుద్దీన్ చంపేందుకు ఆలంఖాన్ రూ.25లక్షల సుపారీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. తన భూములకు అడ్డం పడుతున్నాడని కారణంగానే మొహిజుద్దీన్‌ను వారు హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.ఇక, ఈ కేసులో ఆలంఖాన్ కుమారుడు ముజాహిద్ ఆలంఖాన్ సహా గ్యాంగ్ నలుగురు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. మొహిజుద్దీన్ హత్య కోసం ఆలంఖాన్ ఇప్పటికే 10 సార్లు ప్లాన్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్లాన్ ప్రకారం.. మొహిజుద్దీన్‌ను సుపారీ గ్యాంగ్ కారుతో ఢీకొట్టి చంపినట్టు పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా.. మొహిజుద్దీన్ కొన్నేళ్లుగా వక్ఫ్ భూముల పరిరక్షణకు పోరాడుతున్నారు. ఓ భూమికి సంబంధించి బర్కత్‌పురకు చెందిన ఆలంఖాన్‌తో విభేదాలు వచ్చాయి. తమ ఆధీనంలో ఉన్న ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ పలుమార్లు ఒత్తిడి తీసుకువచ్చారు. తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగడంతోపాటు ఆ భూ వివాదం కేసు నుంచి వైదొలిగితే రూ.2 కోట్లు ఇస్తామంటూ మొహిజుద్దీన్‌కు ఆఫర్ చేశారు. అయితే రాజీ పడబోనని చెప్పడంతో మొయిజుద్దీన్‌ను హత్యను చేయాలని భావించారు. ఆ పనిని సుపారీ గ్యాంగ్‌తో పనిపూర్తి చేయించాలని నగరానికి చెందిన కిషన్ సింగ్ అలియాస్ పప్పును వీరు కలిసి విషయం చెప్పారు. సుపారీ కింద రూ.15 లక్షలు చెల్లించారు. హత్య బాధ్యతను కవాడిగూడకు చెందిన సింగూరి అభిజీత్ అలియాస్ నాని, వినయ్, మణిదీప్‌లకు అప్పగించి రూ.10 లక్షలు చెల్లించాడు. ఈ ముగ్గురూ పప్పుతో కలిసి పథకం వేసి, కారు కొని, రెక్కీ చేసి, శనివారం మొయిజుద్దీన్‌ను రెడ్‌హిల్స్ శాంతినగర్‌లో హత్య చేశారు.అభిజిత్ గుర్తింపు... స్టంట్స్ చేయడంలో అనుభవం ఉన్న అభిజితే ఆ రోజు కారు నడిపాడు. మణిదీప్, వినయ్ అందులో కూర్చున్నారు. డ్రైవింగ్ నైపుణ్యం కారణంగానే ఇతడు నడిపిన, మొయిజుద్దీన్ ఎక్కబోయిన కార్లలో ఏదీ దెబ్బతినలేదు. ఈ హత్య చేసే సమయంలో కారుకు నెంబర్ ప్లేట్ లేకపోయినా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అధ్యయనం చేశారు. వీటి ఆధారంగా అభిజిత్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
సెలవుపై వెళ్లిన సీపీ తిరిగి వస్తారా..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనర్ సీపీ గౌస్ ఆలంకు కోపమొచ్చింది. తన కిందిస్థాయి సిబ్బంది విషయంలో చర్యలు తీసుకుంటుంటే రాజకీయ నేతలు అడ్డుపడటంపై తీవ్ర అసహనానికి గురయ్యారు. ఉన్నతాధికారులకు చెప్పి సెలవుపై వెళ్లిపోవడం డిపార్ట్మెంట్లో చర్చనీయాంశంగా మారింది. డిపార్ట్మెంట్ అంతర్గత వ్యవహారంలో రాజకీయ జోక్యంతో కమిషనరేట్‌లో సీపీ.. వ్యవహారానికి కేంద్రబిందువుగా నిలిచిన ఎస్సై నలిగిపోతున్నారు. సెలవుపై వెళ్లిన సీపీ మళ్లీ వస్తారా..? లేక ఆయనపై బదిలీ వేటు వేస్తారా..? అనే విషయం హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో ఇటీవల ఓ ఐఏఎస్ అధికారి విషయంలో సాగిన ప్రచారం దుమారం రేపిన విషయం మరువకముందే మరో సివిల్ సర్వెంట్ రాజకీయ నేతల కారణంగా మనస్తాపానికి గురవడం గమనార్హం.అసలేం జరిగింది?కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ఓ స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా ఉన్న ఎస్సైపై ఫిర్యాదులు రావడంతో సీపీ విచారణకు ఆదేశించారు. ఎస్సైకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకనప్పటికీ.. క్రమశిక్షణ ఉల్లంఘన కింద అటాచ్ చేసేందుకు సీపీ సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఓ అధికారపార్టీ నేత తాను పోస్టింగ్ ఇప్పించుకున్న ఎస్సైపై చర్యలు తీసుకోవద్దని హుకూం జారీ చేశారు. నొచ్చుకున్న సీపీ ఎస్సైని అటాచ్ చేశారు. ఇది తెలిసిన నేత.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద దిక్కు అయిన తూర్పు నేతను కలిశారు. ఎస్సైపై చర్యల విషయంలో సీపీకి.. డీజీపీకి ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమ అంతర్గత విషయంలో సిబ్బందిపై చర్యలు తీసుకుంటుంటే అంతమంది అడ్డుపడటంపై సీపీ తీవ్రస్థాయిలో నొచ్చుకున్నారు. ఎస్సైని సస్పెండ్ చేసి సెలవుపై వెళ్లిపోయారు. తన అటాచ్మెంట్ విషయంలో రాజకీయ నేతలు జోక్యం చేసుకుని సస్పెండ్ అయ్యేలా చేయడంపై ఎస్సై మదనపడుతున్నారు. తనకు మద్దతుగా వచ్చి ఇప్పుడు తన కెరీర్‌నే ప్రమాదంలో పడేసిన నేతల తీరును చూసి ఎస్సై వణికిపోతున్నారు.డిపార్ట్మెంట్లో జోరుగా చర్చఅంతర్గత సిబ్బందిని క్రమశిక్షణలో ఉంచాలనుకున్న సీపీ విధులకు అడ్డు తగిలిన నేత అంతటితో ఆగి ఉంటే వ్యవహారం ఇంతదూరం వచ్చి ఉండేది కాదు. తన మాట కాదన్నాడన్న అహంతో పెద్దనేత వద్దకు వెళ్లి సీపీపై ఫిర్యాదు చేయడం.. ఆయన సీరియస్ అవడంతో ఎస్సై సస్పెన్షన్‌కు దారి తీసింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు డిపార్ట్మెంట్లో జోరుగా చర్చ సాగుతోంది. తమ విషయాల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకుని, విషయాన్ని పెద్దది చేయడం నేతలకు తగదని హితవు పలుకుతున్నారు. అటాచ్‌మెంట్‌తో పోయే వ్యవహారాన్ని సస్పెన్షన్ వరకు తీసుకొచ్చి ఎస్సై భవిష్యత్తును గందరగోళంలో పడేసిన రాజకీయ నేతలపై మండిపడుతున్నారు. రాజకీయ జోక్యంతో ఇటీవల ఐఏఎస్ అధికారి, తాజాగా కరీంనగర్ సీపీ మనస్తాపానికి గురైన తీరును చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కట్నం కోసం ముక్కు, జడ కోసేశాడు..
పిలిబిట్: ఉత్తరప్రదేశ్‌లోని పిలిబిట్లో అమానుషం చోటుచేసుకుంది. కట్నం కోసం ఓ భర్త రాక్షసంగా ప్రవర్తించాడు. భార్య అనే కనికరం కూడా లేకుండా కత్తెరతో ఆమె ముక్కు, జడ కోశాడు. కోత్వాలీ పూరాన్‌పూర్‌లో ఈ దారుణం బుధవారం ఉదయం వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉండే ఆలమ్ భార్య రుబీనాను కట్నం కోసం గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. రూ.20వేలతో పాటు బైక్ ఇవ్వాలంటూ అత్తమామలను డిమాండ్ చేశాడు. అయితే కట్న దాహం తీరకపోవటంతో ఆలమ్ ఈ దారుణానికి తెగబడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు రుబీనాను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై ఆగ్రహం చెందిన బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలమ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.


