శాసనసభ్యుల కోటా నుంచి కాంగ్రెస్ పార్టీకి దక్కబోయే ఒకేఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి ఆశావహులు భారీగా పోటీ పడుతున్నా రు.
ఒక్కసీటు కోసం 40 మంది పోటీ
ఢిల్లీలో ముఖ్యనేతల మోహరింపు
హైదరాబాద్ : శాసనసభ్యుల కోటా నుంచి కాంగ్రెస్ పార్టీకి దక్కబోయే ఒకేఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి ఆశావహులు భారీగా పోటీ పడుతున్నా రు. నామినేషన్లకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఆశావహులు ఢిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద తమకు ఉన్న పరపతిని ఉపయోగిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓడిపోయిన వారికి అవకాశం ఇచ్చేది లేదని అధిష్టానం యోచిస్తున్నట్టుగా పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.
పార్టీకోసం పూర్తికాలం పనిచేసేవారు, అంకితభావం ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి మహిళకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన కూడా అధిష్టానం వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. అయినా కొందరు ఎలాగైనా ఎమ్మెల్సీ పదవిని కైవసం చేసుకోవాలని ఢిల్లీలో రెండురోజులుగా మకాం వేశారు. పీసీసీ మాజీ అధ్యక్షులు డి.శ్రీని వాస్, పొన్నాల లక్ష్మయ్య వంటివారు ఢిల్లీలోనే ఉం డి ప్రయత్నాలు చేస్తున్నారు.
వీరితో పాటు మాజీ ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, సీనియర్లు కొందరు అక్కడే ఉండి ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. గత ఎన్నికల్లో పోటీచేయడానికి అవకాశం రానివారు కూడా తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. మహిళకు అవకాశం ఇవ్వవచ్చనే వార్తల నేపథ్యంలో పలువురు మహిళలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నేరెళ్ల శారదకు టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా చేయడంతో ఎమ్మెల్సీ పదవిపై ఆశ వదులుకున్నారు. మాజీ అధ్యక్షురాలు ఆకుల లలిత, పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలి, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి మహిళా కోటాలో ముందు వరుసలో ఉన్నారు.