ఇదీ జాబితా!

Congress MLA Candidates List Is Ready Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు సిద్ధమైంది. ఇన్నాళ్లు తీవ్ర ఉత్కంఠతకు గురిచేసిన టీపీపీసీ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 స్థానాలకు గాను 11 చోట్ల అభ్యర్థులతో జాబితా సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు        పేర్కొన్నాయి. ఈ జాబితాను బుధ లేదా గురువారాల్లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక మహాకూటమి పొత్తులో భాగంగా మత్రపక్షాలను కేటాయించేందుకు గాను మూడు సీట్లను పెండింగ్‌లో పెట్టారు. కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల అనం తరం కూటమి మిత్రపక్షాలకు ఆయా స్థానాలను కేటాయించే అవకాశం ఉంది.
  
గెలుపు గుర్రాలే లక్ష్యంగా..
 
ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను మట్టి కరిపించనున్నట్లు చెబుతున్న కాంగ్రెస్‌ పార్టీ ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కావొద్దనే భావనతో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా స్వయంగా పార్టీ అధిష్టానం రంగంలోకి దిగి నియోజకవర్గాల్లో ఎవరెవరికి ఏ మేరకు బలం ఉందో సర్వే చేయించింది. ఈ మేరకు గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని టికెట్లు కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం.

దాదాపు కొన్ని నియోజకవర్గాల్లో ముందు నుంచి పని చేసుకుంటున్న వారు బలంగా మారడంతో వారికే అవకాశం కల్పించాలని భావించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం పార్టీలో ఇటీవల చేరిన వారికి కూడా అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ఇక నారాయణపేటలో కూడా గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన కుంభం శివకుమార్‌రెడ్డి ఇటీవలి కాలంలోనే కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కూడా కాంగ్రెస్‌ టికెట్‌ను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కూటమి కోసం సర్దుబాటు 
రాజకీయంగా బలమైన టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా కాకుండా కూటమిగా ఏర్పడి ఎలాగైనా ఢీకొట్టాలనే భావనతో కాంగ్రెస్‌ పార్టీ ఈసారి టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో కలిసి మహాకూటమిగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలోని మిత్రపక్షాలకు స్థానం కల్పించడం కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతానికి మూడు స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. జడ్చర్ల, మహబూబ్‌నగర్, మక్తల్‌ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్‌ తొలి జాబితాలో పేర్లు ప్రకటించడం లేదు. దీంతో ఈ మూడు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో సీపీఐ ఏ ఒక్క స్థానాన్ని కూడా కోరుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ, టీజేఎస్‌ పార్టీలు టికెట్ల కేటాయింపు కోసం పట్టుబడుతుండగా.. మూడు స్థానాలను పక్కన పెట్టినట్లు సమాచారం.
 
మహబూబ్‌నగర్‌పై పీటముడి 

మహాకూటమిలో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలకు సంబంధించి మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం విషయంలోనే చిక్కుముడి నెల కొంది. మహబూబ్‌నగర్‌ స్థానం కోసం కాంగ్రెస్‌ తో పాటు టీడీపీ, టీజేఎస్‌ గట్టిగా పట్టుబడుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి ఈ సీటు కోసం నలుగు రు తీవ్రంగా పోటీ పడుతున్నారు. డీసీసీ అధ్యక్షు డు ఒబేదుల్లా కొత్వాల్‌తో పాటు టీపీసీసీ కార్యద ర్శులు మారేపల్లి సురేందర్‌రెడ్డి, ఎన్‌.పీ.వెంకటేశ్, పార్టీలో ఇటీవలి కాలంలో చేరిన సయ్యద్‌ ఇబ్రహీం ఈ సీటును ఆశిస్తున్నారు.

అలాగే మిత్రపక్షాల తరఫున టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ కూడా ఈ సీటు కోసం పట్టుబడుతున్నారు. ఎర్ర శేఖర్‌ గతంలో జడ్చర్ల నుంచి గెలుపొందినప్పటికీ ... ప్రస్తుతం మాత్రం మహబూబ్‌నగర్‌ స్థానం ఆశిస్తున్నారు. మరోవైపు తెలంగాణ జన సమితి కూడా మహబూబ్‌నగర్‌ స్థానం కావాలని కోరుతోంది. ఉమ్మడి జిల్లాలో కేవలం ఒక్క మహబూబ్‌నగర్‌ ఇస్తే సరిపెట్టుకుంటామని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు కేటాయించాలనుకుంటున్న మూడు స్థానాలు ఎవరెవరికి దక్కుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మిగిలింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top