చలో ఢిల్లీ!

Congress MLA Candidates Go To Delhi - Sakshi

మెదక్‌ కాంగ్రెస్‌ టికెట్‌ విషయంలో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఈ టికెట్‌ను దాదాపుగా పద్నాలుగు మంది నాయకులు ఆశిస్తున్నారు. కానీ ఇందులో పీసీసీ  కొంత మంది పేర్లను గుర్తించి వాటిని ఏఐసీసీకి పంపించింది. దీంతో ఆశావహుల చూపు హస్తినవైపు మళ్లింది. స్థానికంగా ఉంటే సీటు వస్తుందో? రాదో? అన్న అనుమానంతో ఢిల్లీకి వెళ్లి ఎలాగైనా టికెట్‌ను దక్కించుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్‌ తమకే వస్తుందని ఆశావహులందరూ ఆశాభావం వ్యక్తం చేయడం కొసమెరుపు.

సాక్షి, మెదక్‌: జిల్లాలో కాంగ్రెస్‌ టికెట్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది. మెదక్‌ నియోజకవర్గ ఆశావహుల ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. కొందరు నాయకులు ఇది వరకే ఢిల్లీలో తిష్టవేసి కాంగ్రెస్‌ టికెట్‌ సాధనలో నిమగ్నమయ్యారు. అధిష్టానం పెద్దలను కలుసుకుని ఎలాగైనా టికెట్‌  సాధించేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ నుంచి సీన్‌ ఢిల్లీకి మారింది. మెదక్‌ టికెట్‌ కోసం కాంగ్రెస్‌లో గట్టి పోటీ ఉంది. 14 మంది ఆశావహులు ఎమ్మెల్యే టికెట్‌ను కోరుతూ పీసీసీకి దరఖాస్తులు సమర్పించిన విషయం తెలిసిందె. ఎవరికివారే తమకు టికెట్‌ కేటాయిస్తే గెలిపిచూపిస్తామని స్క్రీనింగ్‌ కమిటీకి తెలియజేశారు. మెదక్‌ అసెంబ్లీ నుంచి తమకు గల విజయావకాశాలను, ఆర్థిక స్థితిగతులు తదితర విషయాలను చెప్పుకున్నారు.

అదే సమయంలో కాంగ్రెస్‌లోని తమ “గాడ్‌ఫాదర్‌’ల ద్వారా టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ  రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా తదితర కీలక నేతలను కలిసి టికెట్‌ ఇప్పించాలంటూ కోరుతున్నారు. ఈ వరసలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నాయకులు బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, చంద్రపాల్, మ్యాడం బాలకృష్ణ, మామిళ్ల ఆంజనేయులు, అమరసేనారెడ్డి, శ్రీనివాస్, ముక్తార్, రామచంద్రాగౌడ్, బానాపురం మధుసూదన్‌రెడ్డి తదితరులున్నారు.

వీరంతా టికెట్‌ కోసం పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసే స్క్రీనింగ్‌కమిటీ ఆశావహుల దరఖాస్తులను పరిశీలించటంతోపాటు సర్వే రిపోర్టులను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే వివిధ వర్గాల ద్వారా మెదక్‌అసెంబ్లీ టికెట్‌ ఎవరికి ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్న వివరాలు కూడా సేకరించినట్లు తెలుస్తోంది. మెదక్‌ అసెంబ్లీ టికెట్‌ కేటాయింపు విషయంలో మాజీ ఎంపీ, స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మెదక్‌ ఎమ్మెల్యే టికెట్‌ కోసం ముగ్గురు నుంచి ఐదుగురు పేర్లను ఏఐసీసీకి పంపినట్లు సమాచారం. ఈ పేర్లను పరిశీలించిన అనంతరం ఏఐసీసీ చీఫ్‌ రాహుల్‌గాంధీ టికెట్‌ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 25వతేదీన కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పర్యటన ముగిసిన వెంటనే.. 
మెదక్‌ టికెట్‌ కేటాయింపు అంశం ఢిల్లీకి చేరడంతో ఆశావహులు ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్క్రీనింగ్‌ కమిటీ ఫైనల్‌ చేసిన లిస్టులో తమ పేరు ఉందని తెలుసుకున్న నేతలంతా ఢిల్లీ వెళ్లి టికెట్‌ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. శశిధర్‌రెడ్డి నాలుగు రోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసి టికెట్‌ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత జైపాల్‌రెడ్డితోపాటు సీడబ్ల్యూసీలోని ఇద్దరు నేతలను కలిసి తనకు మెదక్‌ టికెట్‌ ఇప్పించాలని కోరినట్లు తెలుస్తోంది.

అధిష్టానం పెద్దలు సైతం ఆయనకు టికెట్‌ వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆయన మెదక్‌కు తిరుపయనమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ మైనార్టీ నేత ముక్తార్‌ ఇది వరకే ఢిల్లీ వెళ్లివచ్చారు. కాంగ్రెస్‌ అగ్రనేత అహ్మాద్‌పటేల్‌ను కలిసి మైనార్టీకోటాలో తనకు మెదక్‌ టికెట్‌ ఇప్పించాలని కోరారు. తాజాగా స్క్రీనింగ్‌ కమిటీ పంపిన జాబితాలో తమపేరు ఉందని భావిస్తున్న కాంగ్రెస్‌ ఆశావహులు బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, మ్యాడం బాలకృష్ణ తదితరులు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణలో రాహుల్‌గాం« దీ పర్యటన ముగిసిన వెంటనే వీరంతా ఢిల్లీ లో టికెట్‌ వేట సాగించేందుకు సిద్ధం అవుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top