మహా కుంపటి !

Congress Leaders Disappointed Allocating Seats Of Grand Alliance - Sakshi

కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు 

అశావహుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం 

ప్రత్యామ్నాయ మార్గాన్వేషణలో కొందరు.. 

మరికొందరు రెబెల్‌గా పోటీ చేసేందుకు సమాయత్తం 

సాక్షి,ఖమ్మం: జిల్లాలో కాంగ్రెస్‌ ప్రకటించిన మధిర, పాలేరు నియోజకవర్గాల్లో అసంతృప్తి జాడలు పెద్దగా కనిపించకపోయినా.. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానంగా భావిస్తున్న ఖమ్మం సీటును మహాకూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీకి కేటాయించడంపై కాంగ్రెస్‌ నేతల్లో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిన్నటి వరకు ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ ఆశావహులు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, శాసన మండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి.. దీనిని టీడీపీకి కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర అనుచరులు ఈ సీటును కూటమికి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. భవిష్యత్‌ కార్యాచరణ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్‌లో తనకు సీటు ఖాయమని భావించి.. ఏడాది కాలంగా ఖమ్మం నియోజకవర్గ రాజకీయాలపై పూర్తిస్థాయి దృష్టి సారించిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 

తమ సామాజిక వర్గానికి కాంగ్రెస్‌ పార్టీలో అన్యాయం జరిగిందని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్న పోట్ల.. తన అనుచరులతో సమావేశమై తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్‌లో కమ్మ సామాజిక వర్గానికి గుర్తింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. ఇక వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మానుకొండ రాధాకిషోర్‌ సైతం తనకు టికెట్‌ దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నిర్ణయం మేరకే నడుచుకుంటామని చెబుతున్నా.. ఆయన వర్గీయులు గురువారం మానుకొండ వ్యవసాయ క్షేత్రం వద్ద సమావేశం నిర్వహించారు. మానుకొండతోపాటు పాలేరు టికెట్‌ ఆశించిన రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నేతలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి సన్నిహితుడు దిరిశాల భద్రయ్య తదితరులు హాజరయ్యారు. 

రాధాకిషోర్‌ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ వేసి తీరాల్సిందేనని కార్యకర్తలు పట్టుబట్టారు. పార్టీ కోసం పని చేసిన వారిని కాదని.. పొత్తుల పేరుతో టీడీపీకి ఇవ్వడం వల్ల గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జరిగిన నష్టమే ఈసారీ పునరావృతం అవుతుందని పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి సూచన మేరకు తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకుంటామని, కార్యకర్తల అభిప్రాయాలను ఆమె దృష్టికి తీసుకెళ్తానని, త్వరలోనే కార్యాచరణ రూపొందించుకుందామని మానుకొండ కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.  

పొంగులేటి కలత.. 
ఇక కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్న తనకు పదేపదే పార్టీలో అన్యాయం జరుగుతోందని, ఖమ్మం టికెట్‌పై పూర్తిస్థాయి ఆశలు పెట్టుకున్న శాసన మండలి ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తనకు సీటు రాకపోవడంపై తీవ్ర కలత చెందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సుధాకర్‌రెడ్డి అనుచరులు ఖమ్మం టికెట్‌ టీడీపీకి కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి.. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని పునరాలోచించాలని ఇప్పటికే కోరారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్, కాంగ్రెస్‌ పార్టీలో మూడు దశాబ్దాలకు పైగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తనకు పార్టీపరంగా తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాహుల్‌గాంధీ భవిష్యత్‌ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే అవకాశం లభిస్తుందని భరోసా ఇచ్చినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇక మహాకూటమి అభ్యర్థిగా అధికారికంగా ఖరారైన నామా నాగేశ్వరరావుకు సొంత పార్టీలో పెద్దగా తలనొప్పులు లేకపోయినా.. కాంగ్రెస్‌ నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను సర్దుబాటు చేయడం సవాల్‌గానే పరిణమించింది. 

టికెట్‌ ప్రకటించిన వెంటనే ఖమ్మం చేరుకున్న నామాకు టీడీపీ శ్రేణులతోపాటు సీపీఐ, కాంగ్రెస్‌లోని కొందరు నేతలు, కార్యకర్తలు స్వాగతం పలకడంతో శుభపరిణామంగా భావించినా.. 24 గంటల్లో అదే పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థులు సిద్ధం కావడంతో ఆనందం ఆవిరయ్యే పరిస్థితి నెలకొంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వర్గీయులతోపాటు మాజీ మంత్రి సంభాని, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్‌ వర్గీయులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ శ్రేణులు.. వారికి వాస్తవ పరిస్థితులను వివరిస్తూ.. కూటమి విజయానికి కృషి చేయాల్సిందిగా కోరేందుకు టీడీపీ సమాయత్తమవుతోంది. టీడీపీ తరఫున జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, ఖమ్మం మహాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ నేతలతో సమాలోచనలు జరిపారు. గురువారం రాత్రి నగరంలోని త్రీటౌన్‌ ఏరియాలో కాంగ్రెస్‌ శ్రేణులు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి నామా హాజరుకావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. నామా నామినేషన్‌ వేసే నాటికి కాంగ్రెస్‌ శ్రేణుల్లో తనపై ప్రజ్వరిల్లిన అసమ్మతి సెగలను చల్లార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

వైరాపై ఫలించని విజ్ఞప్తులు.. 
ఇక వైరా నియోజకవర్గాన్ని ఈసారి కాంగ్రెస్‌కే కేటాయించాలని, పొత్తుల్లో ఏ పార్టీకి ఇవ్వొద్దంటూ నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు చేసిన విజ్ఞప్తులు, ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సీటును మహాకూటమి పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించడంతో ఆ పార్టీ అభ్యర్థిగా విజయాబాయిని ప్రకటించింది. దీంతో ఇక్కడ పోటీ చేసేందుకు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ నేత, మాజీ పోలీస్‌ అధికారి రాములునాయక్, మరో నేత లకావత్‌ గిరిబాబు కూటమి తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాములునాయక్‌ కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ చేజారడంతో తన రాజకీయ భవిష్యత్‌పై కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతో సమాలోచనలు జరుపుతున్నారు. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో పర్యటించి.. కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులను కలిసి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. 

కూటమి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయాలని కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి వస్తున్న ఒత్తిడితోపాటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత సైతం తనకు కలిసొస్తుందనే భావనతో రాములునాయక్‌ ఈ ఎన్నికల్లో వైరా నుంచి పోటీ చేసేందుకు దాదాపు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. 17వ తేదీన ఆయన నామినేషన్‌ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 18వ తేదీన వైరా సీపీఐ అభ్యర్థిగా విజయాబాయి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇక పాలేరు విషయానికొస్తే మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌కు ఈ నియోజకవర్గ టికెట్‌ లభించకపోవడంతో ఆయన కినుక వహించారు. పాలేరుతో ఆయనకు గల రాజకీయ సంబంధాల దృష్ట్యా.. తనకు సహకరించాలని పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి సంభానిని అభ్యర్థించినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top