రాష్ట్రంలో కాంగ్రెస్‌ కనుమరుగు | Congress Disappears in Telangana State: P. Chandra Sekhar | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కాంగ్రెస్‌ కనుమరుగు

Jul 20 2019 12:00 PM | Updated on Jul 20 2019 12:01 PM

Congress Disappears in Telangana State: P. Chandra Sekhar - Sakshi

నల్లగొండ టూటౌన్‌ : ఏపీతో పాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ కనుమరుగైందని, ఇక రాష్ట్రంలో ఉండేది బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలే అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలను బీజేపీలోకి ఆహ్వానించాలని నిర్ణయించామని, అందరూ చేరి మోదీ నాయకత్వానికి అండగా ఉండాలన్నారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందని, కేంద్ర పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన కింద కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.60 లక్షలు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని వారి జాబితా ఇవ్వమంటే కేంద్రం అడిగినా ఇవ్వలేదన్నారు. వర్షాలు పడక కరువు తీవ్రంగా ఉందని, ఫసల్‌ బీమా యోజనకు కేంద్రం 85 శాతం చెల్లిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అమలు చేయడంలో విఫలమైందన్నారు. కేంద్రం డిజిటల్‌ ఇండియా చేసేందుకు నిధులు ఇచ్చినా గ్రామ పంచాయతీలకు హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించడంలో కేటీఆర్‌ విఫలమైనట్లు తెలిపారు.

నల్లగొండ మున్సిపాలిటీకి 14 ఆర్థిక సంఘం ద్వారా, అమృత్‌ కింద కేంద్రం రూ. 250 కోట్లు ఇచ్చిందని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇక నుంచి 15 రోజులకో సారి కేంద్ర మంత్రి రాష్ట్రంలో పర్యటిస్తారని తెలిపారు. రాష్ట్రంలో  కేంద్ర పథకాల అమలుకు ఒక మంత్రికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసి కుటుంబ పాలనను అంతమొందిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి,  రాష్ట్ర నాయకుడు గార్లపాటి జితేంద్రకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెళ్లి చంద్రశేఖర్, ఓరుగంటి రాములు, బండారు ప్ర సాద్, శ్రీరామోజు షణ్ముక, బాకి పాపయ్య, పల్లెబోయిన శ్యాంసుందర్, పోతెపాక సాంబయ్య, చింతా ముత్యాల్‌రావు,  శ్రీనివాస్‌రెడ్డి, నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, రాఖీ పాల్గొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement