అర టీఎంసీ ఇస్తే ఇబ్బంది లేదు

Concerns of farmers raising about water - Sakshi

నిపుణుల సూచన  

ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ప్రస్తుతం 16 టీఎంసీల నీళ్లు 

నీళ్లకోసం ఉధృతమవుతున్న రైతుల ఆందోళనలు 

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: కాకతీయ కాలువ ఆధారంగా పంటలు వేసుకుంటున్నాము. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ నీళ్లిస్తే ఎండిపోతున్న మా పంటలు గట్టెక్కుతాయి. మేము రోజుకు 200 క్యూసెక్కులే నీటిని వదలమంటున్నాము. నెలంతా ఇచ్చినా అర టీఎంసీకి మించదు. ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చాక సెప్టెంబర్‌లో నీళ్లిస్తామని సర్కారు అంటోంది. అప్పటి వరకు మా పంటలు బతుకుతయా? ఒక్క తడి ఇచ్చినా పంటలు గట్టెక్కుతాయి. 
– ఇది ఎస్సారెస్పీ కాకతీయ కాలువ రైతుల ఆవేదన. 

ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులో ప్రస్తుతం 16 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. తాగునీటి అవసరాలు, డెడ్‌స్టోరేజీ, ఆవిరి నష్టాలకు పోను ఉన్న నీరు బొటాబొటిన సరిపోతాయి. రాబోయే రోజుల్లో ఎగువన వర్షాలు కురిసి.. ప్రాజెక్టులోకి నీరు వస్తే కాకతీయ కాలువతో పాటు, సరస్వతి, లక్ష్మి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.     
– ఇది ప్రభుత్వ వాదన. 

ఇదీ ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిస్థితి..
ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 16 టీఎంసీల నిల్వ ఉంది. రైతులు అడుగుతున్న మేరకు రోజుకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తే ఇబ్బందేమీ లేదని నిపుణు లు పేర్కొంటున్నారు. ఇలా నెలంతా ఇచ్చినా అర టీఎంసీకి మించదని అంటున్నారు. ప్రస్తుతమున్న 16 టీఎంసీల్లో.. మిషన్‌ భగీరథకు 6.5 టీఎంసీలు, డెడ్‌స్టోరేజీ 5.0 టీఎంసీలు, ఆవిరి నష్టాలు 3 టీఎంసీలు (4 నెలలకు) పోగా సుమారు 1.5 టీఎంసీలు మిగులుతాయి. ఇందులో నుంచి 0.5 టీఎంసీలు ఇవ్వడానికి ఇబ్బందేమీ ఉండదు. 

సెప్టెంబర్‌లోనే వరద..: గత దశాబ్ద కాలంగా ఎస్సారెస్పీకి వచ్చిన ఇన్‌ఫ్లోలను పరిశీలిస్తే.. సెప్టెంబర్‌ నెలలోనే భారీ ఇన్‌ప్లో వచ్చి చేరుతుంది. దీనికి తోడు జలాశయం ఎగువన ఉన్న మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. అయినా ప్రభుత్వం అర టీఎంసీ ఇచ్చేందుకు ససేమిరా అనడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. 

రెండు జిల్లాల రైతుల ఆందోళన..: ఎస్సారెస్పీ జలవివాదం రోజురోజుకూ ముదురుతోంది. కాకతీయ కాలువకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు ఉద్యమబాట పట్టారు. రైతులకు మద్దతు తెలిపేందుకు నిజామాబాద్‌కు వస్తున్న తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాంను సోమవారం భిక్కనూర్‌ వద్ద అదుపులోకి తీసుకుని తిరిగి హైదరాబాద్‌ తరలించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top