సేంద్రియ సాగుతోనే రైతు బాగు

Collector Dharma Reddy Talk On Organic Farming - Sakshi

మెదక్‌జోన్‌: అన్ని రకాల పంటలతోనే రైతుకు ఆదాయం సమకూరుతోందని  ప్రతిరైతు (ఇంటిగ్రేటెడ్‌) వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి సూచించారు. ఆదివారం హవేళిఘణాపూర్‌ మండల పరిధిలోని కూచన్‌పల్లి గ్రామంలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి, శేరి నారాయణరెడ్డి సాగు చేస్తున్న ఆర్గానిక్‌ వ్యవసాయ క్షేత్రాన్ని  కలెక్టర్, పలువురు జిల్లా స్థాయి అధికారులు పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రియ ఎరువులతో సాగుచేసిన పంటల దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నారు.  ఇంటిగ్రేటెడ్‌ వ్యవసాయంలో భాగంగా నారాయణరెడ్డి, సుభాష్‌రెడ్డిలు  ఆర్గానిక్‌తో సాగుచేసిన అరటితోట, జామతోట, చేపల చెరువు, ఆలుగడ్డ సాగు, కోళ్లు, పశువులు, గొర్రెల పెంపకం, మల్బార్‌చెట్లు , పలురకాల కూరగాయల సాగును డ్రిప్‌ ద్వార సాగుచేస్తూ తక్కువ నీటితో అధికంగా సాగుచేయటం  గర్వించదగ్గ విషయమన్నారు.

ఈ సాగువిధానాన్ని ప్రతి రైతు అలవర్చుకోవలని ఆయన సూచించారు. సేంద్రియసాగుతో  పండించిన పంటలను తింటే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. డ్రిప్‌తో పంటలను సాగుచేస్తే తక్కువ నీటివినియోగంతో అధిక మొత్తంలో పంటలను సాగుచేయవచ్చన్నారు.  ఆయా పంటలను తిలకించిన వ్యవసాయ, హార్టికల్చర్‌ అధికారులు ఈ విషయాన్ని జిల్లాలోని రైతులకు వివరించి సేంద్రియ వ్యవసాయ పెంపుకోసం కృషి చేయాలని సూచించారు. శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ  ఆలుగడ్డ మన ప్రాంతంలో పండదనే అపోహ రైతులకు ఉండేదని, ప్రస్తుతం తన వ్యవసాయక్షేత్రంలో బంగాళదుంప ను పుష్కలంగా పండుతుందని చెప్పారు.

నారాయణరెడ్డి మాట్లాడుతూ  సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తే మూడు సంవత్సరాల పాటు దిగుబడి కాస్త తక్కువగా వచ్చినా అనంతరం మంచి దిగుబడులు వస్తాయన్నారు. తక్కువనీటితో అధికంగా సాగుచేయటంతో పాటు సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలు ఆరోగ్యానికి ఎంతో  మేలు జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం తాము ఇంటిగ్రేటెడ్‌ వ్యవసాయం చేయటంతో  ఎప్పుడూ ఏదోరకమైన పంట చేతికందుతుందని ఫలితంగా  ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయన్నారు.  వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన వారిలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాం, హార్టికల్చరల్‌ అధికారి నర్సయ్య, వెటర్నరీశాఖ అధికారి అశోక్‌కుమార్‌తో పాటు అధికారులు రెబల్‌సన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top