రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత

 Cold temperatures in Telangana brings chill in the spine

ఆదిలాబాద్, మెదక్‌ 14 డిగ్రీలు

వాతావరణంలో మార్పుల వల్లే ఉష్ణోగ్రతల తగ్గుదల

పగలు సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా నమోదు

సాక్షి, హైదరాబాద్‌: వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల చలి తీవ్రతతో రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు నల్లగొండ మినహా అన్ని చోట్లా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గాయి. అత్యంత తక్కువగా ఆదిలాబాద్, మెదక్‌లలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. భద్రాచలం, ఖమ్మంలలో సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో కనిష్ట ఉష్ణోగ్రత 17, ఖమ్మంలో 16 డిగ్రీలుగా నమోదైంది.

మెదక్‌లో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత రికార్డయింది. హన్మకొండలో 3 డిగ్రీలు తక్కువగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా హైదరాబాద్‌లో 17 డిగ్రీలు, రామగుండంలో 18, మహబూబ్‌నగర్‌లో 19 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండలో మాత్రం రాత్రి ఉష్ణోగ్రత ఒక డిగ్రీ అధికంగా 23 డిగ్రీలు నమోదైంది. 

పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికం..
అలాగే రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధికంగా ఉండటం గమనార్హం. గత 24 గంటల్లో ఖమ్మంలో 3 డిగ్రీలు అధికంగా 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మెదక్‌లోనూ 3 డిగ్రీలు అధికంగా 33 డిగ్రీలు రికార్డయింది.

మహబూబ్‌నగర్, నల్లగొండల్లో 2 డిగ్రీలు అధికంగా 33 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాల కాలం నడుస్తోందని, దీంతో ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి తెలిపారు. వాతావరణశాఖ లెక్క ప్రకారం అసలైన శీతాకాలం జనవరి, ఫిబ్రవరి నెలలేనన్నారు. అయితే నవంబర్, డిసెంబర్‌లలోనూ చలి ఉంటుందని వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top