పంటలపై రైతులకు సూచనలు చేయాలి 

CM KCR Hold Review Meeting On Vanakalam Crop Cultivation - Sakshi

శుక్రవారం రాత్రిలోగా విత్తనాలు అందుబాటులో ఉండాలి

మే 31లోపు రైతులు ధాన్యం విక్రయించాలి

వానాకాలంలో పంటల సాగుపై ముఖ్యమంత్రి సమీక్ష

సాక్షి, హైదరాబాద్ ‌: నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు కావడానికి వీలుగా, ఏ క్లస్టర్లో ఏ పంట వేయాలనే విషయంలో అధికారులు రైతులకు వెంటనే తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. సూచించిన పంటకు సంబంధించిన విత్తనాలను శుక్రవారం రాత్రిలోగా గ్రామాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రవీణ్‌రావు, సీడ్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ కేశవులు పాల్గొన్నారు. వానాకాలంలో పంటల సాగు, విత్తనాలు– ఎరువుల లభ్యత, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా  కేసీఆర్‌ పలు ఆదేశాలు జారీ చేశారు. పలు సూచనలు చేశారు. 

ఊ మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను వేయాలని రైతులకు ప్రభుత్వం సూచిస్తోంది. గత వర్షాకాలం వేసిన పంటలతో పోలిస్తే పెద్దగా మార్పులేమీ లేవు. ఈ వర్షాకాలంలో మక్కలు వద్దని మాత్రమే చెప్పాం. మక్కల స్థానంలో కందులు లేదా పత్తి వేయమని కోరాం. గత ఏడాది వర్షాకాలం లాగానే ఈసారి కూడా 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని చెప్పాం. కాకపోతే మార్కెట్లో డిమాండ్‌ కలిగిన వరి వంగడాలను ప్రభుత్వం సూచించిన ప్రకారం వేయమన్నాం. గత ఏడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఈసారి మరో 10–15 లక్షలు పెంచమన్నాం. మిగతా పంటల విషయంలో ఎలాంటి మార్పులు సూచించలేదు. కొద్దిపాటి మార్పులే కాబట్టి రైతులు కూడా సంపూర్ణంగా సహకరించడానికి ముందుకొస్తున్నారు. 

ఊ ఏ క్లస్టర్లో ఏ పంట వేయాలనే విషయంలో నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయాలను అధికారులు రైతులకు చేరవేయాలి. జిల్లాల వారీగా తయారుచేసిన ప్రణాళికను జిల్లాలకు వెంటనే పంపాలి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో అధికారులు సమావేశం అవ్వాలి. జిల్లా వ్యవసాయాధికారులు మండల వ్యవసాయాధికారులకు క్లస్టర్ల వారీగా రూపొందిన ప్రణాళిక ఇవ్వాలి. ఆ మరుసటి రోజు మండలాల్లో వ్యవసాయ విస్తరణాధికారుల సమావేశం నిర్వహించాలి. క్లస్టర్ల వారీగా ఏ పంట ఎంత వేయాలో వివరించాలి. తర్వాత ఏఈవోలు రైతులకు వివరించాలి. సూచించిన ప్రకారం పంటలు వేసే విధంగా రైతులను సమన్వయ పరచాలి. శుక్రవారం రాత్రిలోగా అన్ని రకాల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండాలి.
 
ఊ మే 31 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడపాలి. రైతులు ఆలోగానే తమ ధాన్యం అమ్ముకోవాలి. 31 తర్వాత కొనుగోలు కేంద్రాలు నిలిపివేయాలి. వ్యవసాయశాఖ అధికారులు, రైతుబంధు సమితులు జూన్‌ 1 నుంచి వర్షాకాలం పంటల సాగుపై దృష్టి కేంద్రీకరించాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top