త్వరలో భారీగా కానిస్టేబుళ్ల నియామకం | cm kcr green signal to 14000 police posts  | Sakshi
Sakshi News home page

14,000 పోస్టులకు సీఎం ఓకే

Feb 3 2018 2:09 AM | Updated on Sep 17 2018 6:18 PM

cm kcr green signal to 14000 police posts  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖలో భారీ ఎత్తున కానిస్టేబుళ్ల నియామకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఇటీవలే పంపిన ప్రతిపాదనకు సీఎం ఓకే చెప్పినట్టు సచివాలయ వర్గాల ద్వారా వెల్లడైంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కేబినెట్‌ ఆమోదించిన 14 వేల పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు పోలీస్‌ శాఖ త్వరలో చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ 14 వేల పోస్టుల్లో సివిల్‌ విభాగానికి అధికంగా పోస్టులు కేటాయించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాల పునర్విభజనతో పోలీస్‌ శాఖలో కింది స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో శాంతి భద్రతల విభాగాలు పర్యవేక్షించే సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులు ఇప్పుడు కీలకంకానున్నాయి. 14 వేల పోస్టుల్లో 8 వేల వరకు సివిల్‌ విభాగంలో, 3 వేల పోస్టులు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగంలో, మరో 3 వేల పోస్టులు 

తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ) విభాగంలో భర్తీ చేయాలని పోలీస్‌ శాఖ భావిస్తోంది. జిల్లా హెడ్‌క్వార్టర్లలో అత్యవసర పరిస్థితుల్లో బందోబస్తు కోసం ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ బలగాలను దింపాల్సి ఉంటుంది. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఈ రెండు విభాగాల నియామకాలు కూడా కీలకంకాబోతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు రిజర్వ్‌ బెటాలియన్లలోనూ ప్రస్తుతానికి సిబ్బంది లేరు. దీనితో ఇప్పుడు నియమించే సిబ్బందిని మొత్తం ఈ బెటాలియన్లలో ఉపయోగించుకునేందుకు అవకాశం ఉన్నట్టు ఉన్నతాధికార వర్గాల ద్వారా తెలిసింది.  

జిల్లాకో 500 ... 
కొత్తగా ఏర్పడిన ప్రతీ జిల్లా పోలీస్‌ విభాగానికి 500 చొప్పున కానిస్టేబుల్‌ పోస్టులను కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కొత్త జిల్లాల ప్రకారం రిక్రూట్‌మెంట్‌ చేస్తారా? లేదా ఉమ్మడి జిల్లాల ప్రకారం చేస్తారా అన్న అంశంపై సందిగ్దత ఏర్పడింది. ఇటీవల టీఆర్‌టీకి సంబంధించి కొత్త జిల్లాల వారీగా నోటిఫికేషన్‌ ఇవ్వడంతో చాలా సమస్యలు వచ్చిపడ్డాయి. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్‌ను సరిచేయాల్సి వచ్చింది.  

ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు? 
ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన 14 వేల పోస్టుల్లో రిజర్వేషన్ల ప్రకారం ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయిస్తారన్న అంశంపై కూడా మరికాస్త స్పష్టత రావాల్సి ఉందని పోలీస్‌ శాఖ చెబుతోంది. అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలీస్‌ శాఖ 2015లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో వయోపరిమితి సడలించారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం వయోపరిమితి సడలింపు ఇస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. దీనిపై పోలీస్‌ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీస్‌ శాఖ 2015లో చేపట్టిన నియామకాల్లో గందరగోళం ఏర్పడింది. దీనితో కొంత మంది అభ్యర్థులు హైకోర్టు వెళ్లి ఉద్యోగాలు సాధించారు. అయితే ఈ సారి ఎలాంటి చిక్కులు రాకుండా పక్కా ప్రణాళికతో నియామక ప్రక్రియను పూర్తిచేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నట్టు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement