అత్యంత ఆనందకరం: కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

అత్యంత ఆనందకరం: కేసీఆర్‌

Published Thu, Apr 25 2019 4:34 AM

CM KCR Congratulates Kaleshwaram project staff - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్‌ రన్‌ విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. 124.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులతో 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపింగ్‌ అనుకున్నది అనుకున్నట్లు విజయవంతంగా జరగడం అత్యంత ఆనందకరమని సీఎం అభివర్ణించారు. ఇంతటి భారీ సామర్థ్యమున్న పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా భారత్, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. ‘తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా మెదడును కరిగించాం. అనేక రకాలుగా ఆలోచించాం. ఎంతో శోధించి, చివరికి ప్రాణహిత నది గోదావరిలో కలసిన తర్వాత కాళేశ్వరం దగ్గర మాత్రమే నీటి లభ్యత ఉందని నిర్ధారించుకున్నాం.

అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడం మినహా మరో మార్గం లేదని తీర్మానించుకున్నాం. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి రాష్ట్రంలోని 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్‌ ప్రణాళిక తయారు చేయడానికి నెలల తరబడి కసరత్తు చేశాం. రక్షణ శాఖ అనుమతి తీసుకుని మరీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా లైడార్‌ సర్వే నిర్వహించి, పక్కా అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. గోదావరి నుంచి నీటిని తోడటానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 139 మెగావాట్ల భారీ సామర్థ్యమున్న పంపుసెట్లను వినియోగించడానికి డిజైన్‌ చేశాం. గతంలో రాష్ట్రంలో 80 నుంచి 85 మీటర్ల వరకు మాత్రమే ఎత్తిపోసిన అనుభవం ఉంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో పంపు గరిష్టంగా 120 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంపింగ్‌ చేసే ప్రణాళిక ఉంది.

ఈ ప్రణాళిక తయారు చేయడానికి, అమలు చేయడానికి ఇంజనీర్లు, అధికారులు విదేశాలకు కూడా వెళ్లారు. సంపూర్ణ అధ్యయనం చేసి, పూర్తి అవగాహనతో పనులు చేపట్టారు. భగవంతుడి ఆశీస్సుల వల్ల అనుకున్నది అనుకున్నట్లు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర రైతుల తలరాత మార్చే అదృష్టం. ప్రాజెక్టు పనుల్లో రేయింబవళ్లు కష్టపడుతున్న అధికారులు, ఇంజనీర్లకు హృదయపూర్వక అభినందనలు’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కాళేశ్వరం ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్‌ రన్‌ విజయవంతం కావడంలో కృషి చేసిన ఇంజనీర్లకు, టెక్నీషియన్లు, వర్కర్లకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కాళేశ్వరం ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వర్లుకు ఫోన్‌ చేసి అభినందించారు. 

స్పీకర్‌ హర్షం... 
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్‌ రన్‌ విజయవంతం కావడంపై శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రికార్డు సమయంలో పనులను పూర్తి చేసి విజయవంతంగా ట్రయల్‌ రన్‌ పూర్తి చేసిన అధికారులకు, ఇంజనీరింగ్‌ సిబ్బందికి అభినందనలు తెలిపారు.  

హరీశ్‌రావు హర్షం... 
కాళేశ్వరం వెట్‌ రన్‌ విజయవంతం కావడంతో కష్టపడిన ఇంజనీర్లకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement