‘ప్రైవేటు’కి అనుమతిస్తే తప్పేంటి?

Claims ended on Corona healing pill for private hospitals - Sakshi

ప్రైవేట్‌ ఆస్పత్రులకు కరోనా వైద్యం పిల్‌పై ముగిసిన వాదనలు

తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వాసుపత్రుల్లోనే కరోనా పరీక్షలు, వైద్యం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు తీర్పు వాయిదా పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు, వైద్యం చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ హైదరాబాద్‌ నాచారం ప్రాంతానికి చెందిన గంటా జయకుమార్‌ దాఖలు చేసిన పిల్‌పై మంగళవారం ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం తెలిపింది. ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వాసుపత్రుల కంటే మెరుగైన సౌకర్యాలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉన్నప్పుడు వాటికి అనుమతి ఇస్తే తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. ఫలానా ఆస్పత్రిలోనే వైద్యం చేయాలని ప్రభుత్వం ఎలా నిర్దేశిస్తుందని, ఎక్కడ వైద్యం చేయించుకోవాలో రోగికి ఉన్న హక్కు కదా అని కూడా ప్రశ్నించింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునేందుకు ఐసీఎంఆర్‌ అనుమతిచ్చినప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదనే సందేహాన్ని వ్యక్తం చేసింది.

ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాల లేమిపై పత్రికల్లో కథనాలు వస్తూనే ఉన్నాయని, కుక్కలు సంచరిస్తున్నట్లు, పారిశుధ్యం దారుణంగా ఉన్నట్లు కూడా వార్తలొచ్చాయని వ్యాఖ్యానించింది. ప్రైవేట్‌ ఆస్పత్రులపై ప్రభుత్వానికి నమ్మకం లేదా లేక అక్కడ వైద్యం చేసే వైద్యులపై లేదా అని ధర్మాసనం నిలదీసింది. గచ్చిబౌలి స్టేడియాన్ని ఆస్పత్రిగా చేసినా అక్కడ తగినంతగా వైద్యులు, పడకలు లేవని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. తొలుత పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రభాకర్‌ వాది స్తూ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యానికి అనుమతి ఇస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు.

రాష్ట్రంలో 12 ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించుకునేందుకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇస్తే ప్రభుత్వం మాత్రం చేయనీయట్లేదన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ, ఈ దశలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు అనుమతిస్తే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. కరోనాకు మాత్రమే వైద్యం చేస్తే ఫర్వాలేదని, ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చిన వారికీ వైద్యం చేస్తే మరింత ప్రమాదమని, అప్పుడు పరిస్థితులు ప్రభుత్వం నుంచి చేజారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top