పట్నం బాబుల పాలిట్రిక్స్‌ | city people political campaign in villages for upcoming panchayat elections | Sakshi
Sakshi News home page

రాజధాని నుంచి మళ్లీ మాతృభూమికి

Jan 22 2018 5:21 PM | Updated on Jan 22 2018 5:49 PM

city people political campaign in villages for upcoming panchayat elections - Sakshi

ఉద్యోగం, వ్యాపారం ఇతర కారణాలతో పల్లెలను వదిలి పట్టణాల్లో స్థిరపడ్డ వారు మళ్లీ ఉన్న ఊరిపై మమకారం పెంచుకుంటున్నారు. ఆర్థికంగా బలపడడంతో వారి కన్ను ఇప్పుడు స్థానిక రాజకీయాలపై పడింది. ఇంకేముంది.. డబ్బు సంచులతో గ్రామాల్లో దిగిపోతున్నారు.లోకల్‌ పవర్‌ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు విందులు, బేరసారాలు.. సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొత్తానికి పట్నం బాబుల రాకతో పల్లె రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

సాక్షి, యాదాద్రి : స్థానిక సంస్థలకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో పట్నం బాబుల్లో కదలిక మొదలైంది. రాజధానిలో ఉండి ఆర్థికంగా బలపడిన వారిలో చాలా మంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అంతేకాకుండా యాదాద్రి భువనగిరి జిల్లా గ్రేటర్‌కు పొరుగునే ఉండడం.. వచ్చివెళ్లడానికి అంత కష్టమైన పనేమీ కాకపోవడంతో పదవీ కాంక్ష పెంచుకుంటున్నారు. అదే లక్ష్యంగా ముందస్తుగానే గ్రామాలకు చేరుకుని జోరుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుంచే ఓటర్లను ఆకర్షించేందుకు చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా విందులు, బేరసారాలు ఇస్తున్నారు. ఎంత డబ్బయినా ఖర్చు పెడుతామంటూ ఎక్కడికక్కడ సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా జరుగుతున్న గ్రామీణ ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. ఇంతకాలం హైదరాబాద్‌ నగరంలో ఓటరుగా ఉన్న వారు.. ప్రస్తుతం గ్రామాల్లో ఓటు హక్కు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.   
 

పాగా వేయడమే లక్ష్యంగా..
జిల్లాలో ప్రస్తుతం 334 గ్రామ పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉంది. అదనంగా మరో 100 వరకు నూతన పంచాయతీలు, ఐదు నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. గ్రామ పంచాయతీలకు స ర్పంచ్‌లు, వార్డు సభ్యులను, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు చైర్మన్లను, కౌన్సిలర్లను ఎన్నుకుంటారు. ఇందుకోసం సర్పంచ్‌లు, నగర, మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక పరోక్ష పద్ధతిలో నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో వార్డు సభ్యులుగా, కౌన్సిలర్లుగా గెలిస్తే ఎం త డబ్బు ఖర్చు చేసైనా పాగా వేయొచ్చనే లక్ష్యంతో పట్నం బాబులు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం వార్డుల వారీగా ఓటర్లు, ప్రస్తుతం ఉన్న జనా భా, కులం, మతం, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వారి కోసం చేయాల్సిన ఖర్చు తదితర అంశాలపై లెక్కలు గడుతున్నారు.
 

పదవికోసం కొందరు.. ఉన్నవారికి సేవ చేసేందుకు మరికొందరు..
ప్రధానంగా జీవనోపాధి, ఉద్యోగం, విద్య, వ్యాపారం నిమిత్తం పల్లెలను వదిలిన పలువురు పట్టణాల్లో ఆర్థికంగా బలపడ్డారు. వీరిలో కొందరు మాతృభూమికి సేవ చేయాలన్న ఆలోచనకు వచ్చారు. ఇందుకోసం స్థానిక సంస్థల్లో పవర్‌ సాధించడం ద్వారా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మంచి అవకాశంగా భావిస్తున్నారు.
మరికొందరు మాత్రం అధికారం కోసం పావులు కదుపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజధాని హైదరాబాద్‌కి పొరుగునే ఉండడడంతో పట్నం బాబులు, పల్లెలకు వచ్చి వెళ్లడం చాలా సులువుగా ఉంటుంది.

ముమ్మరంగా సాగుతున్న కసరత్తు..
మరోవైపు అధికార యంత్రాంగం నూతన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల ఏర్పాటుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. నూతన గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలకు సంబంధించిన భౌగోళిక మ్యాప్‌లు, వాటి ఆదాయ, వ్యయాలు, ఓటర్ల విభజన, ఆస్తులను విభజన చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈనెల 25వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపే పనిలో అధికారులు ముందుకు సాగుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement