‘చెడ్డీ గ్యాంగ్‌’ చిక్కింది!

cheddi gang arrested - Sakshi

ముగ్గురు సభ్యులున్న ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు

ఆదిభట్ల ఓఆర్‌ఆర్‌ సమీపంలో పట్టివేత

వేలిముద్రల ఆధారంగా ‘చెడ్డీ గ్యాంగ్‌’గా గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారుల్లో వరుస చోరీలతో కలకలం సృష్టించిన కరడుగట్టిన అంతర్రాష్ట్ర చెడ్డీ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని దహోడా జిల్లా సహోదా గ్రామానికి చెందిన అన్నదమ్ములు పారమౌర్‌ కిషన్‌ బాధ్య, పారమౌర్‌ రావోజీ బాధ్య, వీరి బంధువు గనవ భరత్‌ సింగ్‌ను ఆదిభట్ల ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని చెట్లపొదల్లో తచ్చాడుతుండగా రాచకొండ ఎస్‌వోటీ, సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.3,50,000ల విలువచేసే 10 తులాల బం గారం, కిలో వెండి ఆభరణాలు, రూ.3వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో జాయింట్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు, క్రైమ్స్‌ డీసీపీ నాగరాజుతో కలసి కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ బుధవారం మీడియాకు తెలిపారు.

సహోదా గ్రామంలో దినసరి కూలీలుగా పనిచేసుకునే కిషన్, రావోజీ, భరత్‌ సింగ్‌తో పాటు మరో 8 మందిని అదే గ్రామానికి చెందిన రామ్‌జీ.. సూరత్‌లో పని కోసం తీసుకెళ్లి చోరీల బాట పట్టించాడు. అలా నేరాలబాట పట్టిన వీరు 2010లో ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారిం చారు. 2012లో బోయిన్‌పల్లి పోలీసులు ఈ గ్యాంగ్‌ లో ఒకరిని, 2014లో మేడిపల్లి పోలీసులు మరికొంత మందిని అరెస్టు చేశారు. 2017లో మీర్‌పేట ఠాణా పరిధిలో జరిగిన చోరీ కేసులో దినేశ్‌ అరెస్టు కాగానే అతడి వేలిమద్రలు, వ్యక్తిగత వివరాలు తీసుకున్నారు.

దినేశ్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం మీర్‌పేట ఠాణా పరిధిలోని బడంగ్‌పేటలో, అగ్రికల్చర్‌ కాలనీలో చెడ్డీ గ్యాంగ్‌ చోరీలతో కలకలం సృష్టించింది. మియాపూర్, ఘట్‌కేసర్‌ ప్రాంతాల్లోనూ కలకలం సృష్టించింది. దీంతో వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆయా చోరీల్లో పోలీసులకు లభించిన వేలిముద్రలతో చెడ్డీ గ్యాంగ్‌ దగ్గర తీసుకున్నవాటితో సరిపోయాయి. దీంతో ఇది చెడ్డీ గ్యాంగ్‌ పనే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దినేశ్‌ నుంచి సేకరించిన వివరాల ప్రకారం సహోదా గ్రామానికి చేరుకున్నారు.  

అక్కడ వారికి నేరచరిత్ర లేదు: దినేశ్‌ గురించి అక్కడ పోలీసులను వాకబు చేయగా నేరచరిత్ర ఏమీ లేదని తేలింది. ఆ గ్రామంలో 35 కుటుంబాలు ఉండగా అంతా బంధువులే కావడం విశేషం. స్థానిక పోలీసుల సహకారంతో ఆ ఊరులోకి వెళ్లిన రాచకొండ పోలీసులకు చిత్రవిచిత్రాలు కనిపించాయి. ప్రతి ఇంటి ముందు ముళ్ల పొద ఉంది. పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు అనేక మార్గాలు ఉండటం కనిపించింది. దినేశ్‌ కోసం వచ్చారని తెలుసుకున్న ఆ గ్రామవాసులు మిగతావారిని కూడా అప్రమత్తం చేయడంతో తప్పించుకున్నారు. ఇలా నెలరోజుల పాటు అక్కడే ఉండి వారిని పట్టుకునే అవకాశం రాలేదు. కానీ ఆ గ్యాంగ్‌ సమాచారం తెలుసుకోగలిగారు.  

ఆదిభట్లలో అరెస్టు: పోలీసులు సహోదాలోనే ఉన్నట్లుగా భావించిన ఈ గ్యాంగ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆదిభట్ల ప్రాంతంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో తచ్చాడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురిని పట్టుకున్నారు. అనుమానం వచ్చి వారిని మీర్‌పేట ఠాణాకు తరలించారు. గతంలో సేకరించిన వేలిముద్రలతో ఇద్దరివి సరిపోలడంతో వారు చెడ్డీ గ్యాంగ్‌గా తేలింది. దినేశ్, సురేశ్, కిషన్‌లు ముఠాగా మారి చోరీలు చేస్తున్నారని తేలింది.

ఇక్కడ చోరీలతో సొంతూర్లో దీపావళి..
‘చోరీలు చేసేందుకు రైలు మార్గం ద్వారా వచ్చే వీరు 4 ప్రాంతాలను ఎంచుకొని ఒక్కో స్టేషన్‌లో దిగిపోతారు. ఆయా స్టేషన్లలో ఇద్దరు ఉంటే మరో ఇద్దరు వెళ్లి తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి వచ్చేవారు. శివారు ప్రాంతాల్లో ఉండే ఇళ్లను లక్ష్యంగా చేసుకునేవారు. పగటి వేళ అడవి లాంటి ప్రాంతంలో ఉండి రాత్రి కాగానే ప్యాంట్, షర్ట్‌ విప్పేసి చెడ్డీ వేసుకొని నడుంకు షర్ట్‌ చుట్టుకొని చెప్పులు చేతపట్టుకొని చోరీకి బయలుదేరతారు. శరీరానికి నూనెను రాసుకుంటారు.

గోడలు ఎక్కి దూకే సందర్భంలో ప్యాంట్‌ వేసుకొని ఉంటే కిందపడే అవకాశముంటుందని చెడ్డీలు ధరిస్తారు. తాళాలు పగులగొట్టడంలో అనుభవమున్న ఇద్దరు ఆ పనిచూస్తారు. చోరీలు చేశాక ఒక ప్రాంతంలో కలుసుకుంటారు. చందానగర్‌ ప్రాంతంలో జరిగిన చోరీని దినేశ్‌ గ్యాంగ్‌ చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీపావళికి 2 నెలల ముందు, సంక్రాంతికి హైదరాబాద్‌ వచ్చి చోరీలు చేస్తుంటామని విచారణలో తెలిపారు. చోరీ చేసిన ఆభరణాలను గుజరాత్‌లో అమ్మి సొంతూరులో దీపావళి చేసుకుంటామన్నారు. వీరి అరెస్టుతో రాచకొండ కమిషనరేట్‌లో 8 చోరీలు, సైబరాబాద్‌ పరిధిలో 4, హైదరాబాద్‌ పరిధిలో ఒకటి, ఏపీలోని 15 కేసులు కొలిక్కివచ్చాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top