‘హాజీపూర్‌’ కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు

Charge Sheet Has Filed In Hajipur Serial Murder Case,Bommalramaram - Sakshi

సాక్షి, బొమ్మలరామారం(యాదాద్రి) : పెనుసంచలనం సృష్టించిన హాజీపూర్‌ ముగ్గురు బాలికల వరుస హత్యల కేసు నిందితుడు సైకో కిల్లర్‌ మర్రి శ్రీనివాస్‌రెడ్డి పై పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ఈ మేరకు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఏసీపీ, కేసు విచారణ అధికారి భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. సంచలన్మాకమైన ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసులలో 90 రోజుల నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేసినట్లు డీసీపీ నారాయణరెడ్డి విలేకరులకు తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వరంగల్‌ సెంట్రల్‌ జైలులో విచారణ ఖైదీగా ఉన్న మర్రి శ్రీనివాస్‌రెడ్డిని శిక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.

90 రోజుల తరువాత తెరపైకి హత్యల కేసులు
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్‌ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలను కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన సంఘటనలు వెలుగు చూసిన  విషయం విధితమే. ఏప్రిల్‌ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో  పాములు శ్రావణి హత్యకు గురైన తర్వాత తెట్టె బావిలో ఆమె శవాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకొని విచారించారు.

ఈ ఘటన అనంతరం తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనల హత్యలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణి అత్యాచారం, హత్య కేసులోనే పోలీస్‌ కస్టడీలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని కోర్టుకు రిమాండ్‌ చేశారు. మరో రెండు దారుణాలు వెలుగులోకి రావడంతో ఇద్దరు బాలికల అత్యాచారం, ఆపై హత్య ఘటనలపై యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు వరంగల్‌ సెంట్రల్‌ జైలులో విచారణ ఖైదీగా ఉ న్న శ్రీనివాస్‌రెడ్డిపై బుధవారం నాటికి దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.

ఉరి శిక్షపడేనా
ముగ్గురు బాలికలపై దారుణాలకు ఒడిగట్టిన సైకో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్షపడితేనే నేరాలకు పాల్పడే వ్యక్తులకు తగిన గుణపాఠం కలుగుతుందని గ్రామస్తుల ప్రధాన డిమాండ్‌. ఈ మేరకు అమరణ నిరాహార దీక్షలు, ఆందోళనలు సైతం చేశారు. బాలికల హత్య కేసులలో దర్యాప్తు పూర్తయిందని నిందితుడికి ఎలాంటి శిక్ష పడుతుందోనని హాజీపూర్‌ గ్రామంతోపాటు మండలంలో తీవ్ర చర్చ జరుగుతోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top