ఇది ఆటవిక పాలన

Chada Venkat Reddy fire on trs govt - Sakshi

సాక్షి, కొత్తగూడెం: కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం, శాసనసభలో అన్నీ తానై వ్యవహరిస్తున్న కేసీఆర్‌.. గిరిజనులు, దళితులపై జరుగుతున్న దాడులను పట్టించుకోవడం లేదన్నారు. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో 17వ సర్వే నంబరులో 1956లో పట్టాలు ఇచ్చిన పోడు భూములను లాక్కోవడం దారుణమన్నారు.   విమానాశ్రయం ఏర్పాటు పేరుతో ఆదివాసీల భూములు బలవంతంగా లాక్కుంటున్నారని,  హరితహారం కోసం కూడా వారి భూములు తీసుకుంటున్నారని విమర్శించారు. భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో గొత్తికోయలను చెట్టుకు కట్టేసి కొట్టడం చూస్తే రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యమేలుతున్నట్లు అర్థమవుతోందన్నారు. 

నేరెళ్లలో దళితులపై అమానుషంగా వ్యవహరించారని అన్నారు. అనేక త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో టీఆర్‌ఎస్‌ హయాంలో పేద, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. స్వపరిపాలన కోసం తెలంగాణ సాధిస్తే కేసీఆర్‌  కుటుంబ పాలన సాగిస్తున్నారని అన్నారు. నాలుగు విడతలుగా రుణమాఫీ చేయడంతో రాష్ట్రంలో రైతులపై రూ.8వేల కోట్ల వడ్డీ భారం పడిందని చెప్పారు. అడ్డగోలు నిబంధనల కారణంగా ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో 25 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ఇక పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు రాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేవలం 3శాతం పత్తి మాత్రమే వచ్చిందని సీఎం చెబుతున్నారని, గిట్టుబాటు ధరల స్థిరీకరణ కోసం ఇస్తానన్న రూ.500 కోట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. 

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ శాస్త్రీయత లేకుండా, నిపుణుల కమిటీ వేయకుండా జిల్లాల విభజన చేశారన్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 1/70 చట్టం ఉన్న నేపథ్యంలో ఇక్కడ పరిశ్రమల అభివృద్ధికి అవకాశం లేకుండా పోతోందన్నారు. ఇళ్లు కట్టుకున్నా చట్టబద్ధత ఉండడం లేదన్నారు. ఎంపిక చేసిన చోట్ల 200 ఎకరాల చొప్పున కేటాయించి పరిశ్రమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో వైద్య కళాశాల, మైనింగ్‌ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలం ఏర్పాటు చేసి భద్రాచలాన్ని టెంపుల్‌టౌన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణికి పుట్టినిల్లయిన ఇల్లెందులో 1000 మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌తో పాటు, జిల్లాలో బొగ్గు అధారిత పరిశ్రమలు, 

అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాల, పాల్వంచలో ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలమల్లేష్, పశ్య పద్మ, రావులపల్లి రామ్మూర్తి, సింగరేణి ఏఐటీయూసీ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి శేషయ్య, బందెల నర్సయ్య, ఆర్‌టీసీ ఏఐటీయూసీ ఈయూ నాయకుడు కె.భాస్కర్‌రావు, మహిళా సమాఖ్య నాయకురాలు నల్ల శ్రావణి, బరిగెల సాయిలు, సుగుణ, రాములు, పూనెం శ్రీనివాసరావు, కల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top