బుక్కిందంతా కక్కాల్సిందే 

Central GST Vigilence Has Been Serious About Bran Case In Nalgonda - Sakshi

సాక్షి, మిర్యాలగూడ : సంచలనం కలిగించిన తవుడు జీఎస్‌టీ బుక్కిన కేసును సెంట్రల్‌ జీఎస్‌టీ విజిలెన్స్‌ అండ్‌ ఇంటలిజెన్స్‌ అధికారులు పకడ్బందీగా విచారిస్తున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన తవుడు రవాణా జీఎస్‌టీలో ఎంత బుక్కారో అంతకు మూడింతలు కక్కించే విధంగా విచారిస్తున్నారు. మిర్యాలగూడలో ఉన్న 15 మంది తవుడు కమీషన్‌ ఏజెంట్లను ఐదు రోజుల పాటు విచారించిన అనంతరం వైజాగ్‌లోని సెం ట్రల్‌ కార్యాలయానికి రికార్డులు తరలించారు. కాగా రికార్డుల ఆధారంతో పాటు కమీషన్‌ ఏజెంట్లు చెప్పిన విషయాల ఆధారంగా రైస్‌ మిల్లర్లకు నోటీసులు జారీ చేశారు. మిర్యాలగూడలో 80 పార్‌బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు ఉండగా సగానిపైగా మిల్లులకు నోటీసులు జారీ చేశారు. తవుడు జీఎస్‌టీ కేసును మిల్లర్లకు ఇచ్చిన నోటీసుల ఆధారంగా విచారించనున్నారు. 

వైజాగ్‌ కార్యాలయంలో విచారణ 
తవుడు జీఎస్‌టీ ఎగ్గొట్టిన కేసులో నోటీసులు అందుకున్న రైస్‌ మిల్లర్లను వైజాగ్‌లోని ప్రధాన కార్యాలయంలో విచారించనున్నారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి విచారణకు హాజరుకావాలని నోటీసులలో ఇంటలిజెన్స్‌ అధికారులు పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చిన మిల్లర్ల పూర్తి సమాచారం విజిలెన్స్‌ అండ్‌ ఇంటలిజెన్స్‌ అధికారుల వద్ద ఉన్నందున వారు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వగానే వైజాగ్‌ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. నోటీసులు ఇచ్చిన మిల్లర్లందరినీ అక్టోబర్‌ మొదటి వారంలో పూర్తిస్థాయిలో విచారించనున్నారు. 

మూడింతలు కక్కాల్సిందే 
తవుడు జీఎస్‌టీలో మోసానికి పాల్పడిన మిల్లర్లు, కమీషన్‌ ఏజెంట్ల నుంచి జీఎస్‌టీ ఉన్నతాధికారులు మూడింతలు కక్కించనున్నారు. బ్యాం కు ఖాతాలతో పాటు మెయిల్‌ సమాచారం, బిల్లులు, రికార్డులు పూర్తి స్థాయిలో వైజాగ్‌ కార్యాలయానికి తరలించారు. కాగా మిర్యాలగూడ జీఎస్‌టీ కార్యాలయంలో ఒక్కొక్క కమీషన్‌ ఏజెంటు వారీగా విచారించిన అధికా రులు వైజాగ్‌ కార్యాలయంలో మిల్లర్లను ఒక్కొక్కరిగా విచారించనున్నారు. 

మిల్లర్ల తర్జనబర్జన 
తవుడు జీఎస్‌టీ బుక్కిన కేసులో సెంట్రల్‌ జీఎస్‌టీ ఉన్నతాధికారులు విచారిస్తున్నందున మిర్యాలగూడలోని మిల్లర్లు తర్జనభర్జన పడుతున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌ చుట్టూ చెక్కర్లు కొట్టిన మిల్లర్లు బుధవారం అత్యవసరంగా మిర్యాలగూడలోని రైస్‌ మిల్లర్ల భవనంలో సమావేశం నిర్వహించుకున్నారు. సమావేశంలో తవుడు జీఎస్‌టీ బుక్కిన కేసులో నోటీసులు అందుకున్న విషయంపై చర్చిం చారు. అదే విధంగా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఈ నెలలో నిర్వహించాల్సి ఉండగా తవుడు జీఎస్‌టీ విచారణ జరుగుతున్నందున ఎన్నికలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top