మహిళా కేంద్రాలకు అందని ‘శక్తి’

Central Government Not Released MSKs Budget Till Now - Sakshi

పది నెలలుగా మహిళా శక్తి కేంద్రం సిబ్బందికి వేతనాల్లేవ్‌

2019–20 వార్షిక సంవత్సరం బడ్జెట్‌ ఇప్పటికీ విడుదల చేయని కేంద్రం

గతేడాది ఏప్రిల్‌ నుంచి జీతాలు అందక ఆర్థిక కష్టాల్లో ఉద్యోగులు

ఆందోళనలో మహిళా చట్టాల అమలు కార్యక్రమాలు

గృహ హింస నిరోధక చట్టం, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టం... తదితర అత్యంత ప్రధానమైన చట్టాల అమలు, అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహిళా శక్తి కేంద్రాలు (ఎంఎస్‌కే) నీరసించిపోతున్నాయి. మహిళల శక్తిని చాటే చట్టాలను పర్యవేక్షించే సిబ్బందికి పది నెలలుగా వేతనాలు అందడం లేదు. 2019–20 వార్షిక సంవత్సరంలో ఈ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వలేదు. ఫలితంగా ఎంఎస్‌కేల్లో పనిచేస్తున్న సిబ్బంది ఖాతాల్లో గతేడాది ఏప్రిల్‌ నెల నుంచి ఇప్పటివరకు వేతనాలు జమకాలేదు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఈ సిబ్బందికి ఇచ్చే వేతనాలు అరకొరే అయినప్పటికీ... అవి కూడా సకాలంలో అందకపోవడంతో ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

వేతనమందక...పనిపై శ్రద్ధ పెట్టలేక...
మహిళా శక్తి కేంద్రాల్లో పనిచేసేఉద్యోగులకు ఇదివరకు ప్రతినెల ఐదో తేదీలోగా వేతనాలు అందేవి. కొన్ని సందర్భాల్లో నెలవారీ వేతన చెల్లింపుల్లో జాప్యం జరిగినప్పటికీ ప్రభుత్వం మూడు నెలల్లోగా సమస్యను పరిష్కరించి బకాయిలను క్లియర్‌ చేసేది. ప్రస్తుతం ఈ జాప్యం పది నెలలకు పెరిగింది. గతేడాది ఏప్రిల్‌ నెల నుంచి ఎంఎస్‌కేల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు రాలేదు.

2019–20 వార్షిక సంవత్సరంలో ఎంఎస్‌కేలకు నిర్దేశించిన బడ్జెట్‌ను కేంద్రం విడుదల చేయలేదు. దీంతో వారికి వేతనాలు ఇవ్వలేదని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎంఎస్‌కేలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన బకాయిలు దాదాపు రూ.కోటిన్నర వరకు ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఎంఎస్‌కే విధులేంటి...
మహిళలకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించడంలో మహిళా శక్తి కేంద్రాలు కీలకంగా వ్యవహరిస్తాయి. ఎంఎస్‌కేలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్వహిస్తారు. ఒక్కో మహిళా శక్తి కేంద్రంలో సోషల్‌ కౌన్సిలర్‌(ఎస్సీ), లీగల్‌ కౌన్సిలర్‌(ఎల్‌సీ)తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు(పీసీ), మరో డాటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈఓ) ఉంటారు. సోషల్, లీగల్‌ కౌన్సిలర్లు గృహ హింస చట్టంతో పాటు పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అదేవిధంగా శిక్షణ కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటారు. గతంలో గృహ హింస చట్టంపైనే పనిచేసే సోషల్, లీగల్‌ కౌన్సిలర్లకు ఎంఎస్‌కేల ఏర్పాటుతో అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న ఎంఎస్‌కేలు త్వరలో కొత్త జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top