ఎట్టకేలకు ‘ఎడారి’ నుంచి విముక్తి 

Central and State Governments responded to the Sakshi Article

కేటీఆర్, సుష్మా చొరవతో ఇంటికి చేరిన వీరయ్య 

ఉద్వేగానికి లోనైన కుటుంబ సభ్యులు 

‘సాక్షి’ కథనంతో స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 

అల్గునూర్‌ (మానకొండూర్‌): ఎడారి దేశం సౌదీ అరేబియాలో బందీ అయిన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్య ఎట్టకేలకు స్వగ్రామం చేరుకున్నాడు. ఉపాధి నిమిత్తం విజిట్‌ వీసాపై సౌదీ వెళ్లిన బాధితుడు అక్కడ ఒంటెల కాపరిగా పనిచేశాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంటికి వెళ్తానన్న వీరయ్యను యజమాని ఇంటికి పంపేందుకు నిరాకరించాడు. పైగా ఒంటె చనిపోయిందని చిత్రహింసలు పెట్టాడు. దీంతో బాధితుడు తన బాధను సెల్ఫీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై ‘సాక్షి’లో ‘ఎడారిలో బందీ’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. అప్పటి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడారు. వీరయ్యను క్షేమంగా ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి సౌదీ అరేబియాలోని విదేశాంగ శాఖ కార్యాలయం అధికారులతో మాట్లాడారు. వెంటనే అధికారులు వీరయ్య ఉన్న ప్రదేశానికి చేరుకుని అతడిని వెంటనే భారత రాయబార కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆందోళన చెందవద్దని అభయమిచ్చారు. అక్కడి నుంచే కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. అనంతరం స్థానికంగా నివాసముండే తెలుగువారికి అప్పగించి జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.  

ప్రత్యేక వీసా 
వీరయ్య వీసా ముగియడంతో అతడిని స్వదేశానికి పంపించేందుకు అధికారులు ప్రత్యేక వీసా తయారు చేయించారు. ఈనెల 25న విమానం టికెట్‌ బుక్‌ చేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముంబై వరకు టికెట్‌ బుక్‌ చేయడంతో వీరయ్య ఈ నెల 26న వేకువ జామున సౌదీ అరేబియా నుంచి బయల్దేరాడు. 27వ తేదీన ముంబై చేరుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి బస్సులో జగిత్యాలకు వచ్చి శుక్రవారం కరీంనగర్‌ చేరుకున్నాడు.  

కుటుంబ సభ్యుల ఉద్వేగం 
క్షేమంగా ఇంటికి వచ్చిన వీరయ్యను చూసి కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబాన్ని చూసిన ఆనందంలో వీరయ్య కూడా కన్నీటిపర్యంతమయ్యాడు. తాను మళ్లీ ఇంటికి చేరుతానని అనుకోలేదని ఈ సందర్భంగా వీరయ్య తెలిపాడు. తాను ఇంటికి రావడానికి సహకరించిన కేటీఆర్, సుష్మాస్వరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై సౌదీ వెళ్లిన తాను అక్కడ నరకం అనుభవించానని, గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారు అన్ని సక్రమంగా ఉంటేనే వెళ్లాలని పేర్కొన్నాడు. తమకు స్థానికంగా ఉపాధి లేదని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top