2న రాష్ట్ర మంత్రివర్గ భేటీ

Cabinet Meeting To Be Held On July 2nd  - Sakshi

జీహెచ్‌ఎంసీలో లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకునే చాన్స్‌

సచివాలయం కూల్చివేత, కొత్త భవన నిర్మాణంపై చర్చలు!

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జూలై 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో 15 రోజుల పాటు అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ విధించాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.

లాక్‌డౌన్‌లో భాగంగా అత్యంత కఠినంగా కర్ఫ్యూ విధించాలని, రోజుకు కేవలం గంటా రెండు గంట లు మాత్రమే నిత్యావసరాల కోసం సడలింపులివ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. లాక్‌డౌన్‌ అమలుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఏర్పడనున్న పరిణామాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.  జూలై 3 నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించే అవకాశముందని ప్రభుత్వవర్గాల్లో చర్చ జరుగుతోంది.

సత్వరంగా సచివాలయ కూల్చివేత
సచివాలయ భవనాల కూల్చివేతను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్యాచరణను ప్రారంభించింది. సాధ్యమైనంత త్వరగా ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేసేందుకు సిద్ధమవుతోంది. సోమవారం హైకోర్టు తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సచివాలయ భవనాలను పరిశీలించారు. వెంటనే మిగిలిపోయిన వస్తు సామగ్రితో పాటు డీ బ్లాక్‌లో ఉన్న ఐటీ సర్వర్లు రెండ్రోజుల్లో తరలించాలని ఆదేశించారు.

అక్కడే ఉంటున్న ఎస్పీఎఫ్‌ సిబ్బంది తో పాటు, మీడియా పాయింట్‌ను సైతం ఖాళీ చేయాలని కోరారు. దీంతో సెక్రటేరియెట్‌ ఎస్పీఎఫ్‌ అధికారులు గేట్లకు తాళాలు వేశారు. గతేడాది జూన్‌ 27న సీఎం కేసీఆర్‌ కొత్త సెక్రటేరియెట్, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశా రు. హైకోర్టులో కేసు దాఖలు కావడంతో పనులు ప్రారంభం కాలేకపోయాయి. సరిగ్గా ఏడాది దాటిన రెండో రోజే హైకోర్టు భవనాల కూల్చివేత, కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హైకోర్టులో తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయకుండా కేవియట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఆలస్యం చేయకుండా సత్వరంగా సచివాలయ భవనాల కూల్చివేతలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రెండు మూడ్రోజుల్లో నిర్వహించనున్న రాష్ట్ర మంత్రివర్గ భేటీలో సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణంపై కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు  శ్రావణ మాసంలోగా కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top