బీఆర్‌ఎస్‌ గుడ్‌న్యూస్‌

BRS Scheme Application Verification Completed - Sakshi

పూర్తయిన బీఆర్‌ఎస్‌ దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన  

కేటగిరీల వారీగా విభజన

69 శాతం నివాస గృహాలే

నివేదికను హైకోర్టుకు అందజేయనున్న అధికారులు  

న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగాతదుపరి చర్యలు

గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే బల్దియాకు ఆదాయం

సాక్షి, సిటీబ్యూరో: బీఆర్‌ఎస్‌ (బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌) కింద అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకొని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి త్వరలోనే శుభవార్త అందనుంది. దాదాపు నాలుగేళ్లుగాఅదిగో.. ఇదిగో.. అంటున్నప్పటికీ ముందుకుసాగని దరఖాస్తుల ప్రాథమిక పరిశీలనను అధికారులు ఎట్టకేలకు పూర్తి చేశారు. ఇందులో భాగంగా దరఖాస్తులను వివిధ కేటగిరీలుగా వర్గీకరించారు. అందిన దరఖాస్తుల్లో 3వేలు ప్రాథమిక పరిశీలనలోనేబీఆర్‌ఎస్‌కు అనర్హమైనవని గుర్తించారు. యూఎల్‌సీ పరిధి, చెరువులు, నాలాలు, వక్ఫ్‌ ప్రభుత్వ భూములను ఆక్రమించి వీటిని నిర్మించినట్లు తేల్చారు.

అనుమతులు లేకుండా భవనాలు, అదనపు అంతస్తులు వేసిన నిర్మించిన వారిలో ఎక్కువ మంది వ్యక్తిగత ఇళ్లవారే ఉండడం నగరంలో స్థలాల డిమాండ్‌కు అద్దం పడుతోంది. మొత్తం 1.27 లక్షల దరఖాస్తుల్లో దాదాపు 69 శాతంవీరివే ఉన్నాయని తేలింది. దరఖాస్తుల్లో ఇండిపెండెంట్‌ ఇళ్లవి 70 వేలు, అపార్ట్‌మెంట్లలోని వ్యక్తిగత ఫ్లాట్లు 18వేలు, బిల్డర్ల అపార్ట్‌మెంట్లు 13వేలు, బహుళ అంతస్తుల భవనాలవి 11వేలు, వాణిజ్య భవనాలవి7వేలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇతరత్రా కూడా మరికొన్ని ఉన్నాయి. అదే విధంగా బీఆర్‌ఎస్‌కు దరఖాస్తుతో పాటు ప్రాథమిక ఫీజు రూ.10వేలు చెల్లించాలనే నిబంధన ఉంది. దరఖాస్తుదారుల్లో దాదాపు 14వేల మంది ఈ ఫీజు చెల్లించలేదని అధికారులు తెలిపారు.     

హైకోర్టు ఆదేశాల మేరకు...  
దరఖాస్తుల ప్రాథమిక పరిశీలనను పూర్తి చేసిన అధికారులు ఈ  జాబితాను హైకోర్టుకు అందజేసి బీఆర్‌ఎస్‌కు అనుమతించాల్సిందిగా కోరనున్నారు. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఫిర్యాదుతో బీఆర్‌ఎస్‌కు బ్రేక్‌ వేసిన హైకోర్టు... దరఖాస్తుల్ని పరిశీలించవచ్చునని, అయితే తాము అనుమతి ఇచ్చే వరకూ క్రమబద్ధీకరణ మాత్రం చేయరాదని ఆదేశించిన విషయం విదితమే. అధికారులు ఎప్పటి నుంచో దరఖాస్తుల వివరాలను హైకోర్టుకు అందజేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ..పరిశీలన పూర్తికాకపోవడంతో సమర్పించలేదు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీతో పాటు ప్రభుత్వానికి కూడా నిధుల కటకట ఉండటంతో... క్రమబద్ధీకరణ ద్వారా భారీ ఆదాయం సమకూరుతుందనే భావనతో దరఖాస్తులను పరిష్కరించాలని సర్కార్‌ బల్దియాకు సూచించింది. అందుకనుగుణంగా అధికారులు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశారు.
యూఎల్‌సీ, నాలా, చెరువులు, తదితర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి జరిపిననిర్మాణాలు బీఆర్‌ఎస్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హమైనవి కావని చీఫ్‌ సిటీ ప్లానర్‌ఎస్‌.దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ జాబితాను హైకోర్డుకు నివేదించాక, న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top