పరిసమాప్తం

Brahmotsavalu Complete in Bhadrachalam Temple - Sakshi

భద్రాద్రిలో ముగిసిన  బ్రహ్మోత్సవాలు

ఆలయంలోనే నిరాడంబరంగా చక్రతీర్థం, శ్రీపుష్పయాగం

భద్రాచలంటౌన్‌: శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో 15 రోజులుగా కొనసాగుతున్న  వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు బధవారం పూర్ణాహుతితో ముగిశాయి. పూర్ణిమ సందర్భంగా ఆలయంలో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బేడా మండపానికి తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆశీనులను చేశారు. రోలు, రోకలికి ప్రత్యేక పూజలు చేసి పసుపు కొమ్ములను దంచారు.

స్వామివారికి ముందుగా చూర్ణోత్సవం, జలద్రాణి ఉత్సవం, నవకలశ స్నపనం జరిపించారు. అనంతరం ఆచార్యులు సుదర్శన చక్రాన్ని శిరస్సుపై ధరించి వైదిక పెద్దలతో కలసి ఆలయంలో ఏర్పాటు చేసిన గంగాళంలో అభిషేకం నిర్వహించారు. చక్రతీర్థంగా అభివర్ణించే ఈ కార్యక్రమం పవిత్ర గోదావరిలో నిర్వహించాల్సి ఉండగా.. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆలయంలోనే అర్చకుల మధ్య నిరాడంబరంగా పూర్తి చేశారు. ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ 12 రకాలుగా ప్రదక్షిణ నిర్వహించి, 12 రకాల ప్రసాదాలను నైవేద్యంగా పెట్టారు. రాత్రికి ఆలయంలోని ఉత్సవ మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ‘ఫృథవీశాంత’ అనే మంత్రంతో మహా కుంభ ప్రోక్షణ నిర్వహించారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అయ్యాయి. కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

నేటి నుంచి నిత్య కైంకర్యాలు..
బ్రహ్మోత్సవాలు ముగియడంతో గురువారం నుంచి స్వామివారికి యథావిధిగా నిత్య కైంకర్యాలు, దర్బార్‌ సేవ, దశవిధ ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. పవళింపు సేవ మాత్రమే నిలిపివేస్తామని చెప్పారు. 16 రోజుల పండుగ రోజున మాత్రమే స్వామివారికి ఏకాంత సేవలు చేస్తామని,  ఈనెల 16న నూతన పర్యంకోత్సవం, ఎడబాటు ఉత్సవం ఉంటాయని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top