ప్రేమ ‘మత్తు’లో ముంచాడు  | Boy Raped On Minor Girl In Tamilnadu | Sakshi
Sakshi News home page

ప్రేమ ‘మత్తు’లో ముంచాడు 

Jun 11 2018 3:03 AM | Updated on Jul 12 2019 3:02 PM

Boy Raped On Minor Girl In Tamilnadu - Sakshi

తిరువళ్లూరు (తమిళనాడు): అభం శుభం తెలీని బాలికను ప్రేమ పేరుతో ఊబిలోకి లాగాడు. మాయమాటలు చెప్పి గంజాయి మత్తుకు బానిసను చేశాడు. మూడు నెలలుగా ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తమిళనాడులో ఓ యువకుడి కీచక పర్వం ఇది. తిరువళ్లూరుకు చెందిన ఓ బాలిక(14) స్థానికంగా ఉన్న ఎయిడెడ్‌ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో బాలిక ఇంటికి సమీపంలో ఉన్న కార్తీక్‌ (18) అనే యువకుడు ప్రేమిస్తున్నట్లు బాలికను నమ్మించాడు. బాలిక తల్లిదండ్రులిద్దరూ కూలి పనులకు వెళ్ళిన తరువాత కార్తీక్‌ ఆ బాలికను ఇంటికి పిలిపించుకుని గంజాయి, మద్యం అలవాటు చేశాడు.

స్నేహితులతో కలసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 5న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవటంతో తల్లిదండ్రులు తిరువళ్లూరు టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక అదృశ్యంపై కేసు   దర్యాప్తు చేసిన పోలీసులు శనివారం రాత్రి 9 గంటలకు తిరువళ్లూరు బస్టాండులో బాలికను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలిక ప్రవర్తనలో తేడా రావటంతో డీఎస్పీ పుహలేంది నేతృత్వంలో ప్రత్యేకంగా విచారణ చేపట్టారు. విచారణలో నమ్మలేని విషయాలు వెలుగులోకి రావటంతో కిడ్నాప్‌ కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక వద్దనున్న సెల్‌ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా 14 మందిలో ఏడుగురిని ఆ బాలిక ద్వారానే పిలిపించి అరెస్టు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement