బీసీల్లోకి సంచార జాతులు

Book Launch of BC Kulalu and Sanchara Jaathulu - Sakshi

     పరిశీలిస్తామన్న సీఎం కేసీఆర్‌ 

     అధ్యయన బాధ్యత ఎంపీ కేకేకు 

     ‘బీసీ కులాలు, సంచార జాతులు’పుస్తకావిష్కరణ 

సాక్షి, హైదరాబాద్‌: 30 సంచార జాతులను గుర్తించి వారిని బీసీ కులాల్లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కులాలను ఎవరూ గుర్తించలేదని ఆయనన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరు గౌరీశంకర్‌ రాసిన ‘బీసీ కులాలు, సంచార జాతులు’పుస్తకాన్ని సీఎం శనివారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. 30 సంచారజాతుల కులాలను బీసీ జాబితాలో చేర్చాల్సి వుందని జూలూరు పేర్కొనగా సీఎం వెంటనే స్పందించారు. సంచార జాతులను బీసీ కులాల్లో చేర్చే విషయంపై అధ్యయన బాధ్యతను రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించారు.

బీసీ కులాల్లో సంచారజాతులకు సంబంధించిన అధ్యయనాన్ని సీఎస్‌తో మాట్లాడిన తర్వాత బీసీ కమిషన్‌ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. బీసీ కులాలలో సారోల్లు, అర్వకోమటి, తోలుబొమ్మలాటవారు, కుల్లకడిగి, బైల్‌ కమ్మర, అహిర్, గోవిలి, బాగోతుల, బొప్పాల, గంజికూటి వారు, శ్రీక్షత్రీయ రామజోగి, ఇనూటి, గుర్రపువారు, అడ్డాపువారు, సారగాని, కడారి తిడారోళ్లు, ఓడ్, పాథం వారు, సాధనాశూరులు, రుంజా, పనాస, పెక్కర, పాండవులవారు, గొడజెట్టి, ఆదికొడుకులు, తెరచీరల, కాకిపడగల, మందహెచ్చుల, పప్పాల, సన్నాయిలు, బత్తిన కులాలకు చెందిన సంచార జాతులను బీసీ కులాల జాబితాలో చేర్చాల్సి ఉంది.

బీసీలు, సంచార జాతుల కోసం నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అధ్యయనాన్ని పుస్తకంలో జూలూరు పొందుపరిచారు. ప్రధానంగా సంచారజాతులకు కులాల పిల్లల విద్యాభ్యాసం కోసం ఏర్పాటు చేసిన 718 గురుకుల పాఠశాలల పురోభివృద్ధిని వివరించారు. సంచార కులాల పిల్లలు తొలిసారిగా బడిగడప తొక్కిన సందర్భాన్ని పుస్తకంలో ఆవిష్కరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎంపీలు కేకే, వినోద్‌కుమార్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top