మాతా శిశు కేంద్రంలో బ్లడ్‌స్టోరేజీ సెంటర్‌

Blood Storage Center Set Up In Karimnagar - Sakshi

కరీంనగర్‌హెల్త్‌: పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. బాలింతలు, గర్భిణులకు అత్యసవర సమయంలో రక్తం అందుబాటులో ఉంచాలని బ్లడ్‌ స్టోరేజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఈ స్టోరేజీ సెంటర్‌ను వారం క్రితమే ఇక్కడికి తరలించారు. కొత్తగా ఆధునిక హంగులతో బ్లడ్‌స్టోరేజ్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించిన ప్రభుత్వం ఇక్కడికి తరలించింది.

రోగుల సంఖ్యకు తగినట్లుగా వైద్యం..
మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి కాన్పుల కోసం వచ్చే వారి సంఖ్య రెట్టింపైంది. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిపించాలని కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రవేశపెట్టిన విషయం విధితమే. ఈ పథకంతో ఆస్పత్రిలో ప్రసవాలు పెరిగాయి. ప్రసుతం నెలలో వెయ్యి ప్రసవాల వరకు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎంసీహెచ్‌సీలో మెరుగైన వైద్యం అందిస్తుండటంతో మాతాశిశు మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. మరణాలు తగ్గడం, మెరుగైన సేవలతో ప్రసవాల సంఖ్య రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలిచి ఉత్తమ వైద్య సేవలకు జిల్లాకు అవార్డు వచ్చింది. ఇదేవిధంగా మరింత వైద్య సేవలతో ప్రజలకు మేలు జరుగాలనే ఉద్దేశంతో బ్లడ్‌స్టోరేజీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
 
రాజన్న సిరిసిల్ల నుంచి తరలింపు..
రాజన్నసిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్‌స్టోరేజీ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. కొత్తగా జిల్లా కావడంతో అక్కడ బ్లడ్‌బ్యాంక్‌ ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వం రెడ్‌క్రాస్‌ సొసైటీ నుంచి అధీనంలోకి తీసుకుని అక్కడి నుంచి కరీంనగర్‌ మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సెంటర్‌ నిర్వహణకు ఉపయోగించే మిషనరీతోపాటు అక్కడ పనిచేస్తున్న ఇద్దరు టెక్నీషియన్లను కూడా డిప్యుటేషన్‌పై బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.

బ్లడ్‌స్టోరేజ్‌ లైసెన్స్‌ కోసం..
మాతాశిశు ఆరోగ్యం కేంద్రంలో వెంటనే బ్లడ్‌స్టోరేజ్‌ సెంటర్‌ ఏర్పాటుకు గదిని కేటాయించారు. ఈ సెంటర్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్‌ మంజూరు కావాల్సి ఉంది. లైసెన్స్‌ కోరుతూ సంబంధి శాఖకు దరఖాస్తు చేసుకోగా ఇటీవల ఐదుగురు సభ్యులు గల బృందం మాతాశిశు కేంద్రాన్ని పరిశీలించింది. బ్లడ్‌స్టోరేజీ సెంటర్‌కు మిషనరీతోపాటు సిబ్బంది, రిఫ్రిజిరేటర్‌ సౌకర్యం, గది వైశాల్యం నిబంధనల ప్రకారం ఉండాల్సి ఉంది. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే అన్ని రకాల బ్లడ్‌ 3 నుంచి 4 యూనిట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. లైసెన్స్‌ మంజూరు కాగానే బ్లడ్‌సోరేజీ సెంటర్‌ త్వరలోనే ప్రారంభం అవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సిబ్బందిని నియమించాలి..
జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌సీలో బ్లడ్‌స్టోరేజీ సెంటర్‌ ఏర్పాటు చేయడంతోపాటు బ్లడ్‌బ్యాంక్‌ ను మరింత ఆధునికీకరించి సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. కోట్లాది రూపాయలతో ఆస్పత్రుల్లో సౌకర్యాలు, మెషినరీ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం కావాల్సిన సిబ్బందిని నియమించడంలో వెనకాడుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆధునిక సౌకర్యాలతో సేవలం దించేందుకు బ్లడ్‌బ్యాంక్‌లో సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top