పేకాటలో జోకర్‌లా చంద్రబాబు

BJP has suffered serious losses because of TDP Says k Laxman - Sakshi

టీఆర్‌ఎస్‌పై పోరాడటంలో కాంగ్రెస్‌ విఫలం

హరీశ్‌రావు వస్తే ఆహ్వానిస్తాం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఎన్నికల్లో దేశంలో పేకాటలో జోకర్‌లాగా మిగిలింది చంద్రబాబు ఒక్కడేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. చంద్రబాబు, టీడీపీ వల్లనే బీజేపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు పరిస్థితి ఎడ్లబండిని మోస్తున్నానని అనుకుంటున్న కుక్క పిల్లలాగా ఉందని దుయ్యబట్టారు. బాబు పెట్టిన ప్రతిపక్షాల మీటింగ్‌కు ఎవరూ రాలేదన్నారు. చంద్రబాబు రాజకీయాల్లో నిజాయితీ గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.

బాబు చచ్చిన పాము అనీ, తాము ఆయనను టార్గెట్‌ చెయ్యాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక వ్యక్తిని మంత్రిని చేసి కనీసం ఎమ్మెల్సీ ఇవ్వకుండా, ఎమ్మెల్యేనూ చెయ్యలేదని, గవర్నర్‌ చెప్తే కానీ రాజీనామా చేయించలేదని, చంద్రబాబుకు రాజ్యాంగం ఏం తెలుసని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బీజేపీ అధికారిక డబ్బుని సీజ్‌ చేశారని, ఎన్నికల కమిషన్‌ తమకు మద్దతు ఇచ్చిం దని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చెయ్యడంలో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు.

తెలంగాణలో రెండు పార్టీల విధానం వచ్చే అవకాశం ఉందని, బీజేపీ టీఆర్‌ఎస్‌ మధ్యనే ఇక పోటీ ఉంటుందన్నారు. సికింద్రాబాద్‌లో జరిగిన ప్రధాని సభకు రాజాసింగ్‌ ఆరోగ్యం బాగాలేక మాత్రమే రాలేదన్నారు. దక్షిణాదిన సొంతంగా ఎదగాలని పార్టీ భావిస్తోందన్నారు. దేశానికి సమర్థ నాయకుడు, సుస్థిర ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకున్నారన్నారు. తాము 17 సెగ్మెంట్లలో సీరియస్‌గా పోటీ చేశామన్నారు. తమ కార్యకర్తల మీద, ప్రజల మీద నమ్మకంతో ఒక రోజు ముందే సంబరాలకు సిద్ధం అవుతున్నామన్నారు.

మోదీ ప్రధాని కాకుండా కుట్రలు
మోదీ తిరిగి ప్రధాని కాకుండా జరిగినన్ని కుట్రలు ఇంతకుముందెప్పుడూ జరగలేదని లక్ష్మణ్‌ అన్నారు. హిందువులు అంటూ రెచ్చగొట్టింది కేసీఆరే అని, మోదీ, షాలు అభివృద్ధి అంశాలు మాత్రమే చెప్పారన్నారు. కేసీఆర్‌ దగ్గర అభివృద్ధి ఎజెండా లేదు కాబట్టి దృష్టి మరల్చే ప్రయత్నం చేశారన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో చాలా మార్పులు ఉంటాయన్నారు. హరీశ్‌ మాత్రమే కాదు.. మోదీని, బీజేపీ విధానాలను నమ్మి ఎవరు పార్టీలోకి వచ్చినా తీసుకుంటామన్నారు. పదవికి రాజీనామా చేయించే తీసుకుంటామన్నారు. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లలో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు. ఓటు శాతం అన్ని పార్లమెంట్‌ స్థానాల్లో పెరుగుతుందని అన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top