సాహిత్యంతో స్ఫూర్తి నింపుతున్న ‘భారతి’

Bharathi Have Literature Talent In Nizamabad - Sakshi

అవయవదానంపై అక్షర సమరం 

వందకు పైగా కవితలు, పాటలు రాసి రికార్డు

బోధన్‌: పట్టణ కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, శరీర, అవయవదానం సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రముఖ రచయిత్రి కాట్రగడ్డ భారతి విభిన్నమైన సామాజిక అంశాలపై అక్షరాలను అస్త్రంగా మలుచుకుని కవితలు, పాటలు రాస్తూ, ప్రజల్లో చైతన్యస్ఫూర్తిని నింపే కార్యరంగాన్ని ఎంచుకుని ముందుకెళ్తున్నారు. సాహితీ రంగంలో తనదైన శైలిలో రచనలు చేస్తూ రాణిస్తున్నారు. భారతి రచనలు తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా శరీర, అవయదానం ప్రాముఖ్యత అంశంపై 140 పైగా స్వీయ రచనలు (కవిత) రాసి  సావిత్రిబాయి పూలే చారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంలో ‘వెన్నెల పుష్పాలు’ కవిత సంకలనం పుస్తకాన్ని ముద్రించారు.

2016 జనవరి 3న హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి చంద్రశేఖర్, ఢిల్లీకి చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దిలీప్‌కుమార్, సావిత్రిబాయి చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రతినిధుల చేతుల మీదుగా కవిత సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. శరీర, అవయవదానం అంశంతో పాటు మాతృభాష ప్రాముఖ్యత, పరిరక్షణ, సామాజిక సమస్యలు, మహిళల సమస్యలపై అనేక కవితలు రాసి ‘కనుత కొలను’ అనే కవిత సంకలనాన్ని ముద్రించి ఆవిష్కరించారు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు, శరీర, అవయదానం సంఘం వ్యవస్థాపకురాలు గుడూరి సీతామహాలక్ష్మి ఉద్యమస్ఫూర్తితో కాట్రగడ్డ భారతి స్పందించి శరీర, అవయవదానం ఉద్యమం భుజాన వేసుకుని రచనలు కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె బోధన్‌ మండలంలోని సంగం జెడ్పీహెచ్‌ఎస్‌లో ఇంగ్లిష్‌ ఉపాధ్యాయురాలు. తెలుగు, ఇంగ్లిష్‌ బాషల్లో  ఎంఏ పూర్తి చేశారు. మంచి వ్యాఖ్యాతగా గుర్తింపు పొందారు. మాతృభాష తెలుగుపై అపారమైన  మమకారం, ఆసక్తి ఆమెలో కనిపిస్తాయి. ఇటీవల 2019 జనవరి 3న విశాఖపట్నంలో జరిగిన సావిత్రి బాయి పూలే జయంతి వేడుకల్లో తాజాగా శరీర, అవయవదానం ప్రాముఖ్యతపై ఆమె స్వీయరచనలు నాలుగు పాటలు, 13 కవితలతో సీడీ క్యాసెట్‌ను రూపొందించి ఆవిష్కరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top