పిడుగులు పడుతున్నాయి జాగ్రత్త 

Beware of Thunderbolts in the state - Sakshi

పలు సూచనలు జారీ చేసిన విపత్తు నిర్వహణ శాఖ

సామాజిక మాధ్యమాలు, వాల్‌పోస్టర్ల ద్వారా అవగాహన  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల పిడుగుపాటు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవిస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వస్తున్నాయి. ఈ క్రమంలో పిడుగులు పడుతున్నాయి. దీంతో జననష్టంతోపాటు మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. చాలాచోట్ల ఆస్తినష్టం సంభవిస్తుంది. గత పక్షం రోజుల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ పిడుగుపాటుపై అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. సామాజిక మాధ్యమాలతో పాటు వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా క్షేత్రస్థాయిలో చైతన్యం కల్పిస్తోంది. పిడుగుపాటు పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో వివరించింది. 

జాగ్రత్తలివే.. 
టీవీ, రేడియో ద్వారా వాతావరణ సమాచారాన్ని తెలుసుకుని స్థానిక హెచ్చరికలను పాటించాలి. తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలి. తప్పని పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉండాల్సి వస్తే మోకాళ్ల మధ్యకు తలను వంచి రెండు చేతులతో చెవులు మూసుకుని భూమికి తగలకుండా వంగి కూర్చోవాలి. గోడలు, తలుపులు, కిటికీలకు దూరంగా నిల్చోవాలి. ఎండిన చెట్లు, విరిగిన కొమ్మలకు దూరంగా ఉండాలి. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు వాటిని సురక్షిత ప్రాంతాల్లో నిలిపి అందులోనే ఉండాలి. పశుసంపదను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. పిడుగుపాటుకు గురైతే బాధితులకు ప్రథమ చికిత్స అందించాలి. వెంటనే దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాలకు తరలించాలి. 

చేయకూడని పనులు: పిడుగులు పడే సమయంలో ఆరుబయట ప్రదేశాల్లో ఉండకూడదు. ఆశ్రయం కోసం చెట్ల కిందకు వెళ్లకూడదు. నీటిలో ఉండకూడదు. లోహపు పైపుల నుంచి వచ్చే నీటిని తాకవద్దు. సెల్‌ఫోన్లు ఉపయోగించవద్దు. రేకుల షెడ్ల కింద, వరండాల్లో ఉండకూడదు. ఉరుములు, మెరుపుల తర్వాత 30 నిమిషాల వరకు బయటకు వెళ్లొద్దు. ఎలక్ట్రిక్‌ ఉపకరణాలు, వ్యవసాయ పంపు సెట్లను ఉపయోగించవద్దు. ట్రాక్టర్, మోటార్‌ సైకిళ్లను ఆరుబయట నిలిపి ఉంచకూడదు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top