ఇక బేటీ బచావో..

Beti Bachao Beti Padhao Special Committee - Sakshi

చైల్డ్‌  ప్రొటెక్షన్‌ కమిటీల  ఏర్పాటు

అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు, సీఆర్‌పీలకు ప్రత్యేక శిక్షణ

బ్లాక్‌ల వారీగా ప్రత్యేక కార్యచరణ

సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్‌ జిల్లా యంత్రాంగం‘‘ బేటీ బచావో – బేటి పడావో’’పై ప్రత్యేక కార్యాచరణకు దిగింది. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్య, విద్యా, జీహెచ్‌ఎంసీ, తదితర శాఖల సమన్వయంలో బ్లాక్‌ స్థాయిలో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీ (సీపీసీ)లను  ఏర్పాటు చేసింది. వివిధ శాఖల క్షేత్ర స్థాయి కార్యాచరణపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది.  ఇప్పటికే బేటీæబచావో–బేటీæపడావో కార్యక్రమం అమలులో  హైదరాబాద్‌కు కేంద్ర స్థాయి గుర్తింపు లభించించింది. అదే స్ఫూర్తితో మరో అడుగు ముందుకు వేసి గర్ల్‌ చైల్డ్‌ ఫ్రెండ్లీ  సిటీగా రూపు దిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు బస్తీ నుంచి బడి వరకు పెద్దఎత్తున ప్రచారోద్యమం, అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. కాగా, బాలికల నిష్పత్తి శాతం మరింత పెంచేందుకు మహిళా భివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అంగన్‌వాడీ టీచర్లు, వైద్యారోగ్య శాఖకు సంబంధించిన ఆశా వర్కర్లు, విద్యాశాఖకు సంబంధించిన క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్స్, జీహెచ్‌ఎంసీకు చెందిన సీసీ, డీపీవోలకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే  మొదటి విడత కింద సుమారు 600 మంది అంగన్‌ వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చింది. రెండో విడత కింద తాజాగా 1000 మంది ఆశా వర్కర్లకు, 48 మంది  క్లస్టర్‌ రిసోర్స్‌పర్సన్,  జీహెచ్‌ఎంసీ సీసీ, డీపీవోలకు ఆరు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  రెండు రోజుల ముందు హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో  శిక్షణ కార్యక్రమాన్ని జాయింట్‌ కలెక్టర్‌ రవి లాంఛనంగా ప్రారంభించారు.

బాలికల నిష్పత్తి పెరుగుతోంది..
నగరంలో  ‘బేటీ æబచావో–బేటి పడావో’  కార్యక్రమంతో బాలికల నిష్పత్తి పెరుగుతోంది. హైదరాబాద్‌ నగరంలో ప్రతి వెయ్యి మంది బాలురకు బాలికల నిష్పత్తి శాతం 914 నుంచి  958 కు చేరుకుంది. వాస్తవంగా  2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో బాలికల నిష్పత్తి తక్కువగా ఉండటం అందోళన కలిగించింది. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు వర్తింప జేసింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం జనవరి 22న నగరంలో  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించి విస్తృత ప్రచారానికి నడుంబిగించింది.  బ్రాండ్‌ అంబాసిడర్‌గా సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను రంగంలో దింపింది. బాలికలపై లైంగిక దాడులకు అడ్డుకట్ట వేసేందుకు గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌ అంశాలను విస్తతంగా ప్రచారం చేస్తోంది. 1098కు ఫోన్‌  చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top