బజారు పాల్జేసిన బ్యాంకు అప్పు

బజారు పాల్జేసిన బ్యాంకు అప్పు


అప్పు చెల్లిస్తామన్న ఇంటిని వేలం వేసిన అధికారులు

ఇల్లు ఖాళీ చేయాలంటూ గేటుకు తాళం

రాత్రంతా ఆరుబయటే




జమ్మికుంట: ఇంటి పేరిట బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లింపులో జాప్యం ఆ కుటుం బాన్ని రోడ్డున పడేసింది. సదరు కుటుంబానికి తెలపకుండానే బ్యాంకు అధికారులు ఇంటిని వేలం వేశారు. మార్కెట్‌ విలువ కంటే తక్కు వకు విక్రయించడం.. రుణం చెల్లిస్తామన్నా వినిపించుకోకుండా ఇంటికి తాళం వేయడం తో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. బాధిత కుటుంబానికి స్థానికులు అండగా నిల వడంతో ఇల్లు ఖాళీ చేయించేందుకు వచ్చిన బ్యాంక్‌ అధికారులు, పోలీసులు వెనకడుగు వేశారు. ఈ ఘటన మంగళవారం జమ్మికుంట లో చోటుచేసుకుంది. జమ్మికుంటలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన నాంపెల్లి కిషన్‌ ఇస్త్రీ దుకాణం పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే కాలనీలో ఇల్లు నిర్మించుకున్నాడు. 



2013లో ఇంటిని బ్యాంకు లో తనఖా పెట్టి రూ.3 లక్షలు రుణం తీసుకు న్నాడు. దాదాపు రూ.2.10 లక్షల వరకు తిరిగి చెల్లించాడు. బ్యాంకు వడ్డీ, అసలు ఇప్పటి వరకు ఇంకా రూ.2.70 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే, డబ్బులు సమ కూరక పోవ డంతో కొద్ది నెలలుగా రుణం చెల్లించడంలేదు. అప్పు చెల్లించాలంటూ బ్యాంక్‌ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఇంటిని వేలం వేస్తామంటూ గత డిసెంబర్‌లో నోటీసు లిచ్చారు. ఈ విషయం తమకు తెలియదని బాధితులు పేర్కొంటున్నారు. గత జనవరిలో వేలం పాట కోసం ప్రకటన జారీ చేశారు. వేలం పాటలో ఇల్లును ఓ వ్యక్తి రూ.11.77 లక్షలకు దక్కించుకున్నట్లు బ్యాంకు ఉద్యో గులు వెల్లడించారు. దాదాపు రూ.20 లక్షల కుపైగా విలువ చేసే ఇల్లును తక్కువ ధరకు దక్కించుకున్నట్లు బాధితులు ఆరోపించారు. తన ఇల్లు తనకు కావాలని, బ్యాంకు అధికా రులు వేలం వేయొద్దని వేడుకున్నా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు.



అప్పు చెల్లించేందుకు డబ్బు తీసుకెళ్తే పట్టించుకోలేదని పేర్కొ న్నారు. చివరికి ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తి బ్యాంక్‌ ఉద్యోగులపై ఒత్తిడి తేవడంతో పోలీసు భద్రత మధ్య ఖాళీ చేయించాలని నాలుగు రోజుల కిందట ఆదేశాలు వచ్చాయి. దీంతో సోమవారం కిషన్‌ కుటుంబం ఇంట్లో లేని సమయంలో ఇంటికి తాళం వేశారు. వేరే గ్రామానికి వెళ్లి తిరిగొచ్చిన కిషన్‌ కుటుంబం చేసేదేమీ లేక రాత్రంతా ఆరుబయటనే ఉండాల్సి వచ్చింది. కిషన్‌ కుటుంబసభ్యులు ఆత్మహత్యకు యత్నించేందుకు సిద్ధపడగా వారి వద్ద నుంచి క్రిమిసంహారక మందును స్థానిక మహిళలు లాక్కున్నారు. తాము అండగా ఉంటామని, న్యాయం కోసం పోరాడ తామని హామీనిచ్చారు.



మంగళవారం ఉదయం బ్యాంకు సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు కిషన్‌ ఇంటికి వచ్చి ఖాళీ చేయించేందుకు యత్నించగా బాధితులు అడ్డుకున్నారు. వారికి మద్దతుగా కాలనీ వాసులు నిలిచారు.  తమకు న్యాయం చేయా లని, ఇల్లు ఇప్పించకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని కిషన్‌ భార్య విజయ హెచ్చరించారు. దీంతో బ్యాంకు అధికారులు వెనుకడుగు వేశారు. కొనుగోలు చేసిన వ్యక్తితో చర్చలు జరిపి బ్యాంకు అప్పు కట్టిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top