‘మనీ’వేదన!

Bank Employees Strike In India - Sakshi

పాలమూరు :  బ్యాంక్‌ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం జాతీయ బ్యాంకులు మూతపడ్డాయి. ఇక నాలుగో శనివారం, ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవులు.. ఇలా వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడడంతో నిత్యం లావాదేవీలు నడిపించే వ్యాపారులు మొదలు సాధారణ ప్రజలు వరకు అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో ప్రధాన లావాదేవీలు నడిచే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, తదితర జాతీయ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో శుక్రవారం తెరుచుకోకపోగా విషయం తెలియని సామాన్యులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత రెండు రోజుల సాధారణ సెలవులు రాగా.. సోమవారం ఒక రోజు మాత్రమే బ్యాంకులు తెరుచుకోనున్నా యి. మళ్లీ మంగళవారం క్రిస్మస్‌ సెలవు, ఆ మరుసటి రోజు బుధవారం మళ్లీ బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. దీంతో సోమవారం తప్పించి వరుసగా ఐదు రోజులు బ్యాంకులు మూతపడుతున్నట్లవుతోంది.
 
నిత్యం రూ.కోట్లలో లావాదేవీలు 
వ్యాపారులే కాకుండా సాధారణ ప్రజలు నిత్యం బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుతారు. ప్రధానంగా వ్యాపారులకు బ్యాంకుల ద్వారా డబ్బు పంపడం, తీసుకోవడం సర్వసాధారణం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని వర్గా ల వారు అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బ్యాంకుల్లో పని చేసే ఉద్యోగులకు వేతన సవరణల్లో అన్ని తరగతుల అధికారుల కు ఒకే రకమైన సవరణ ఉండేది. 11వ వేతన సవరణలో అధికారుల పనితీరు ఆధారంగా వేతన సవరణ చేయాలన్న యాజమాన్యాలు నిర్ణయించి, అమలు చేస్తుండడాన్ని నిరసిస్తూ బ్యాంకు అధికారులు సమ్మెకు వెళ్తున్నారు. దీం తో పాటు చిన్న బ్యాంకుల విలీనాన్ని చేయ రాదని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతలో సాధారణ సెలవులు, క్రిస్మస్‌ సెలవు రావడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. 

వరుస సెలవులతో వెతలు 
బ్యాంకులకు వరుస సెలవులు, సమ్మె కారణం గా బ్యాంకుల సేవలు ఐదు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. ఈనెల 21న బ్యాంకు ఉద్యోగుల సమ్మె చేశారు. ఈనెల 22న నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు పని చేయవు. 23న ఆదివారం సాధారణ సెలవు. 24వ తేదీ సోమవారం బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయి. ఇక ఈనెల 25న కిస్మస్‌ పండగ సెలవు. 26న బ్యాంకు ఉద్యోగుల సామూహిక సమ్మె నిర్వహిస్తున్నారు. ఆ రోజు బ్యాంకులు పని చేయవు.

మొత్తం మీద వారం రోజుల్లో ఒక రోజు మాత్రమే బ్యాంకులు పని చేసే అవకాశం ఉంది. దీంతో అన్ని రకాల సేవలు నిలిచిపోనున్నాయి. నగదు కొరత ఏర్పడే అవకాశం నెలకొంది. సాధారణ రోజుల్లోనే ఏటీఎంలో నగదు లేక ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏటీఎంలలో గురువారం పెట్టిన నగదు శనివారం ఉదయం వరకు ఖాళీ అయ్యింది. దీంతో చాలా మంది ఏటీఎంల చుట్టూ డబ్బు కోసం తిరగడంకనిపించింది. ఈనెల 25న క్రిస్మస్‌ పండగ ఉండటంతో క్రిస్టియన్లు నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లాలి. కానీ పరిస్థితిని చూస్తే పండుగ జరుపుకునేందుకు నగదు ఎలా సమకూర్చుకోవాలని వారు ఆలోచనలో పడ్డారు. కాగా, ప్రైవేట్‌ బ్యాంకులైన యాక్సిస్, ఐసీఐసీఐతో పాటు సహకార బ్యాంకులు తప్ప మిగిలిన జాతీయ బ్యాంకులన్నీ మూతపడటంతో వారం రోజుల పాటు నగదు కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. 

ఏటీఎంలన్నీ ఖాళీ 
జిల్లాలో ఎక్కడ చూసినా ఏటీఎంలు ఖాళీగానే కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా డబ్బు పెట్టకపోవడంతో జనం నిరాశగా వెళ్తున్నారు. పాలమూరు జిల్లా కేంద్రంలోనే 30కుపైగా ఏటీఎంల్లో ఏ ఒక్కదాంట్లోనూ డబ్బు లేకపోవ డం గమనార్హం. ప్రధాన ఏటీఎంల్లో కొంత డ బ్బు పెడుతున్నా గంటలోపే అయిపోవడంతో ఖాతాదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఎక్కడైనా ఏటీఎంలో డబ్బు ఉన్నట్లు తెలియగానే విపరీతమైన రద్దీ నెలకొంటోంది. ఇందులో కొందరికే డబ్బు అందుతుండగా.. మిగతా వారే నిరాశతో వెనుతిరుగుతున్నారు. 

రూ.5వేల కోసం 10ఏటీఎంలు తిరిగాను 
నాకు ఈరోజు ఉదయం అత్యవసరంగా రూ.5వేలు కావాల్సి వచ్చింది. ఖాతాలో డబ్బు ఉందన్న ధైర్యంతో ఏటీఎంకు వెళ్తే ‘నో క్యాష్‌’ బోర్డు కనిపించింది. అలా పట్టణంలోని దాదాపు 10ఏటీఎంలు తిరిగినా అదే పరిస్థితి ఎదురైంది. మామూలు రోజుల్లో ఏటీఎంల్లో డబ్బు పెట్టరు. ఇలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కువ డబ్బు ఉంచడమో లేదా ప్రతిరోజు రెండు పూజలా డబ్బు పెట్టడమో చేస్తే మాలాంటి వారికి ఇబ్బందులు తప్పుతాయి. 
– వినోద్‌కుమార్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top