కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ ఎస్‌లోకి మరిన్ని వలసలకు రంగం సిద్ధమైంది. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలూ నాయక్ కాంగ్రెస్‌ను వీడి అధికార పార్టీలోకి చేరనున్నారు.
మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి వలసలు షురూ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ ఎస్‌లోకి మరిన్ని వలసలకు రంగం సిద్ధమైంది. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలూ నాయక్ కాంగ్రెస్‌ను వీడి అధికార పార్టీలోకి చేరనున్నారు. మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో బాలూ నాయక్ తన అనుచరులతో కలసి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నల్లగొండ జిల్లాలోని గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య ధోరణులతో విసిగిపోయి కాంగ్రెస్‌ను వీడుతున్నట్టుగా ఆయన చెబుతున్నారు. బాలూ నాయక్‌తో పాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా పార్టీని వీడుతున్నారు.
ఎవరికివారే యమునా తీరే....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం లేకుండా పోయింది. పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. భారీ సంఖ్యలో నేతలు పార్టీని వీడుతున్నా అటు అధిష్టానం నుంచి గానీ.. ఇటు రాష్ట్ర పార్టీ ముఖ్యుల నుంచి గానీ ఎలాంటి స్పందనా కనిపించడం లేదు. ఇప్పటికే ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, విఠల్‌రెడ్డి, కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే కవిత తదితరులు పార్టీకి గుడ్‌బై చెప్పారు.
మరికొందరు మాజీమంత్రులూ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లాల్లో మాత్రమే ఉన్న వలసలు ఇక హైదరాబాద్ నుంచి ఉండనున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన కీలక కాంగ్రెస్ నేతలు కూడా పార్టీని వీడనున్నారు. వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీని వీడి, టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఆ పార్టీకి చెందిన ఓ బలమైన నేత చర్చలు జరుపుతున్నారు.