సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు అంతులేని కథలా సాగుతోందని.. నోటీసులు, విచారణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామాలు ఆడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఈ కేసులో సిట్ విచారణ బయల్దేరే ముందు తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, కీలక నేతలతో భేటీ అయ్యారాయన. అనంతరం కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోంది. ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్. ఎన్నికేసులు పెట్టినా భయపడకుండా పోరాడిన నాయకత్వం మా పార్టీది. రాష్ట్రం కోసం రాజీలేని పోరాటాలు చేశాం. అనుక్షణం ప్రజలు, రాష్ట్రం కోసమే పని చేశాం. ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత కేసీఆర్‌ది. కావాలనే బురద చల్లడం, హింసించడం మేం ఏనాడూ చేయలేదు. మేం ఎప్పుడూ టైం పాస్ కార్యక్రమాలు చేయలేదు అని కేటీఆర్ అన్నారు.
పిచ్చోడి చేతిలో రాయిలా.. అసమర్థుడి జీవన యాత్రలా కాంగ్రెస్ పాలన ఉంది. ఒక్కో రోజు ఒక్కో డ్రామాతో నెట్టుకొస్తున్నారు. మేం ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. అక్రమ, అనైతిక పనులు చేయలేదు. అయినా నాపై తీవ్ర వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇందుకు ఎవరు బాధ్యులు? రేవంతా? అధికారులా?. నేను డ్రగ్స్ తీసుకుంటానని.. హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని దిక్కుమాలిన వార్తలు రాయిస్తున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పదేళ్లపాటు రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేశా. ప్రభుత్వం పోలీసులు కలిసి గత రేండేళ్లుగా.. అంతులేని కథలా ఫోన్ ట్యాపింగ్ కేసును నడిపిస్తున్నారు. ఎంక్వైరీలకు భయపడేది లేదు. ఈ కేసుతో నాకేం సంబంధం లేదు. అయినా పిలిస్తే 10సార్లు విచారణకు వెళ్తా..

సింగరేణిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని హరీష్‌రావు చెప్పారు. ఆ కుంభకోణంలో సీఎం రేవంత్‌రెడ్డి బామర్ది సృజన్ రెడ్డిది కీలక పాత్ర. సింగరేణితో సీఎం రేవంత్ ఎలా ఫుట్‌బాల్ ఆడుతున్నారో హరీష్ వివరించారు. అలా మాట్లాడినందుకే నోటీసులు ఇచ్చారు. సిట్ నోటీసులు, విచారణ టైంపాస్ ప్రొగ్రాం అని కేటీఆర్ అన్నారు. మా ప్రభుత్వం ఏం తప్పు చేసిందని అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని చెప్పగలరా?. కాంగ్రెస్ ప్రభుత్వంలో దండుపాళ్యం ముఠా ఉంది. వాళ్ల దోపిడీ బయటపెడతామనే నోటీసులు, విచారణ పేరిట ఇబ్బంది పెడుతున్నారు. రేవంత్‌కు, ఆయన తొత్తులుగా ఉన్న పోలీసులను వదిలేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటాం.. అని కేటీఆర్ అన్నారు.


