‘భగీరథ’ వ్యథ!

Bageerarha Pipelane Leakages in Nizamabad - Sakshi

లీక్‌ అవుతున్న పైప్‌లైన్లు 

నీరు కలుషితమై వ్యాధులు ప్రబలే ప్రమాదం 

అధికారుల పర్యవేక్షణ కరువు

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మిషన్‌ భగీరథ లీకేజీల మయంగా మారింది. చాలా చోట్ల పైప్‌లైన్‌ లీకై నీరంతా వృథాగా పోతుంది. ప్రధాన రహదారుల వెంబడి ఉన్న పైప్‌లైన్‌లకు తరచు లీకేజీలు ఏర్పడుతుండడంతో నీరు కలుషితం అవుతుంది. లీకేజీలను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, మిషన్‌ భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి శుద్ధనీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ అధికారుల అలసత్వంతో ప్రజలకు శుద్ధనీరు అందడం లేదు. సదాశివనగర్‌ మండలంలోని 24 గ్రామ పంచాయతీల పరిధిలో పైప్‌లైన్‌ల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని పాలకులు, ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. వర్షకాలంలో పైప్‌లైన్‌లు లీకయితే బురదనీరు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.  

లీకేజీల మరమ్మతులను సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల తరఫున మరమ్మతులు చేయిస్తే బిల్లుల చెల్లింపులు చేయమని అధికారులు స్పష్టం చేయడంతో భగీరథ ఆశయం నీరు గారిపోతోంది. చాలా గ్రామాల్లో రహదారి మధ్యలో పైప్‌లైన్‌ కోసం తవ్వకాలు చేపట్టి ఆ తర్వాత ఆ రోడ్డుకు మరమ్మతులు చేయలేదు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్‌ భగీరథ పనులను పర్యవేక్షించే అధికారుల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టాల్సి ఉన్నా.. గ్రామాల్లో అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో పైప్‌లైన్‌ లీకేజీలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు లీకేజీలను అరికట్టి శుద్ధనీరు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top