కంపుకొడుతోంది.. 

bad smell is spreading in market area by throwing waste - Sakshi

     మందమర్రి మార్కెట్‌ ప్రాంతం

       చికెన్, చేపల వ్యర్థాలతో తీవ్ర దుర్గంధం

       పట్టించుకోని అధికారులు 

మందమర్రి : పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ ప్రాంతం కంపుకొడుతోంది. ఇష్టారా జ్యంగా నిర్వాహకులు చికెన్, చేపల వ్యర్థాలు మురుగుకాల్వల్లో పడేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. అయినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణ వ్యాప్తంగా ఒకే ఒక కూరగాయల మార్కెట్‌ ఉంది. ప్రధాన మార్కెట్‌కు ఓ వైపు కూరగాయలు విక్రయిస్తుంటారు. మరోవైపు చికెన్‌ సెంటర్, అదేవిధంగా చేపల దుకాణాలు సైతం ఉన్నాయి. చికెన్‌ సెంటర్, చేపల నుంచి, మార్కెట్‌ సెంటర్‌లోని టిఫిన్‌ సెంటర్ల వచ్చే వ్యర్థాలను మురుగుకాల్వల్లో పడేస్తున్నారు. దిగువ ప్రాంతంలో మురుగుకాల్వల్లో నీరు నిలిచి పోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. అయినా మున్సిపాలిటీ సిబ్బంది మురుగు కాల్వలను శుభ్రం చేయడం లేదు. డ్రెయినేజీల్లో మురుగు శుభ్రం చేయకపోతే అంటువ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతీరోజు చెత్త తొలగించడంతోపాటు డ్రెయినేజీ కాల్వల్లోని మురుగు తీసివేయాలని పలువురు కోరుతున్నారు.

 
పట్టించుకునే వారు కరువు 

కూరగాయల మార్కెట్‌ శుభ్రతపై మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని విక్రయదారులు ఆరోపిస్తున్నారు. ప్రతీరోజు వీరి నుంచి తైబజార్‌ రుసుం వసూలు చేస్తారు. ఒక్కో దుకాణానికి రూ.10ల చొప్పున తీసుకుంటున్నారు. కానీ మార్కెట్‌ నిర్వహణ  గాలికొదిలేస్తున్నారు. మార్కెట్లో పశువులు సంచరిస్తున్న పట్టించుకునేవారే కరువయ్యారు. మరుగుదొడ్ల కోసం కేటాయించినా స్థలాన్ని కొందరు కబ్జాకు యత్నిస్తే అడ్డుకున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా మార్కెట్‌ అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

 
     
మార్కెట్లో ఎలా ఉండేది 

కూరగాయలు అమ్ముకోవడానికి గ్రామాల నుంచి వస్తున్నాం. కొన్ని రోజులుగా మార్కెట్‌లో భరించలేని వాసన వల్ల ఉండలేక పోతున్నాం. ఏ సార్లకు చెప్పినా ఎవరూ పట్టించుకుంట లేరు. చికెన్‌ సెంటర్లను, చేపల దుకాణాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. లేదంటే ఎప్పటికప్పుడు మురుగుకాల్వలు శుభ్రం చేయాలి.   – శ్రీనివాస్, బార్బర్‌ షాపు నిర్వాహకుడు, మందమర్రి 

వ్యర్థాలు కాల్వల్లో వేయొద్దు

 
చికెన్, చేపల దుకాణాల యజమానులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేయాలి. ఆయా దుకాణాల నుంచి వెలువడే వ్యర్థాలను కాల్వల్లో వేయకుండా చూడాలి. లేకుంటే ఈ వాసనతో వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.  – సంతోష్,  మార్కెట్‌ సెంటర్, మందమర్రి   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top