చైల్డ్‌ హోంకు అన్విత అప్పగింత

Baby Girl Anvitha Sent to Child Home inKarimnagar - Sakshi

తక్కువ బరువుతో ఆడశిశువు జననం

భారంగా భావించి వద్దనుకున్న తల్లిదండ్రులు

అక్కున చేర్చుకున్న ఆస్పత్రి సిబ్బంది

105 రోజులు కంటికి రెప్పలా కాపాడిన వైనం

బరువు పెరిగిన తర్వాత ఎమ్మెల్యే చేతుల మీదుగా ఐసీడీఎస్‌కు..

కన్నీటి పర్యంతమైన వైద్యసిబ్బంది

కోల్‌సిటీ(రామగుండం): బరువు తక్కువగా జన్మించిన ఆడశిశువు ఆ తల్లిదండ్రులకు భారమైంది. అప్పటికే అధిక సంతానం.. ఈ శిశువు బతకడం కష్టమని భావించి ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లారు. ఆస్పత్రి వైద్యసిబ్బంది అమ్మలా..లాలపోసి.. జోలపాడి.. పాలుపట్టి కంటికి రెప్పలా కాపాడడంతో ఆరోగ్యం మెరుగైంది. బరువూ పెరిగింది. శిశువును స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ చేతుల మీదుగా ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగిస్తూ కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ సంఘటన గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అధిక సంతానం ఉన్న ఓ నిరుపేద దంపతులకు ఈ ఏడాది ఏప్రిల్‌ 3న గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో కవలలు జన్మించారు. వీరిలో మగశిశువు చనిపోగా.. ఆడశిశువు 920 గ్రామాలు బరువు మాత్రమే ఉంది. ఇక బతకడం కష్టమని భావించిన ఆ తల్లిదండ్రులు బిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లారు. ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కంది శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఎన్‌సీయూ విభాగం వైద్యులు, సిబ్బంది ఆ శిశువును అక్కున చేర్చుకుని మానవత్వాన్ని చాటుకున్నారు.

ఐదు రోజులో పది రోజులు కాదు.. ఏకంగా 105 రోజులు శిశువును కంటికి రెప్పలా కాపాడారు. ఏప్రిల్‌ 24న పాపకు ఆస్పత్రిలోనే నామకరణం వేడుక కూడా నిర్వహించారు. కొత్త బట్టలతో పాపను ముస్తాబు చేసి, ఉయ్యాలలో జోలపాడి అన్విత అని పేరుపెట్టారు. ఇప్పటివరకు అన్విత సంరక్షణ బాధ్యతలను ఎస్‌ఎన్‌సీయూ విభాగం వైద్యులు సమత, శ్రీలత, అద్వేష్‌రెడ్డి, సరళి, స్టాఫ్‌నర్స్‌లు కవిత, సంధ్య, రమ, రజని, సరిత, నీల, కేర్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌ సరోజన, కవిత, సరోజన చూశారు. మెరుగైన వైద్యంతోపాటు పోషకా హారం అందించడంతో శుక్రవారం వరకు 2,950 గ్రాముల బరువు పెరిగింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో శుక్రవారం చైల్డ్‌హోంకు తరలించడానికి ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ చేతుల మీదుగా అన్వితను ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. పాపను అప్పగిస్తుండగా బావోద్వేగంతో సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు. వైద్యులు, సిబ్బంది అందరూ పాపతో కలిసి సంతోషంగా ఫొటో దిగారు. కరీంనగర్‌లోని చైల్డ్‌ హోంకు తరలిస్తున్నట్లు జిల్లా డీసీపీఓ జితేందర్, సీడీపీఓ స్వరూపరాణి, కనకరాజు తెలిపారు. 

అభినందించిన ఎమ్మెల్యే చందర్‌
శిశువు ప్రాణాలు కాపాడడమే కాకుండా మానవత్వంతో ఆలనాపాలన చూసి అరోగ్యవంతురాలిగా తీర్చిదిద్దిన వైద్యులు, సిబ్బంది పనితీరు ఆదర్శనీయమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అభినందించారు. పిల్లలను దత్తత తీసుకోవాలని అనుకునే వారు శిశు సంక్షేమశాఖ ద్వారా తీసుకోవచ్చని తెలి పారు. కార్యక్రమంలో రామగుండం నగర మేయర్‌ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top