నేతల వద్దకు ఆశావహులు 

Aspirants Wants Contest In Municipal Elections In Warangal - Sakshi

సాక్షి, జనగామ : నేడో రేపో మునిసిపాలిటీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాబోతుందనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో పోటీకి ఆసక్తి చూపుతున్న ఆశావహులు నేతల వద్దకు క్యూ కడుతున్నారు. అవకాశం కలిసొస్తే పోటీకి తాము సిద్ధమేనంటూ వర్తమానం పంపుతున్నారు. తమ పార్టీ నేతలను కలిసి ఫలనా వార్డు నుంచి తమకు చాన్స్‌ దక్కేలా చూడాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలను మొదలు పెడుతున్నారు. ప్రధాన పార్టీల్లో ఆశావహుల సందడితో పోరుగడ్డ జనగామలో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోం ది. పురపాలక ఎన్నికలను ఎదుర్కోవడానికి రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతుండగా ఆశావహుల ప్రయత్నాలతో రాజకీయ సందడి మొదలైంది. 

నేతల వద్దకు ఆశావహులు..
జనగామ మునిసిపాలిటీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల వార్డుల పునర్విభజన, ఓటర్ల ముసాయిదా, ఓటర్ల కుల గణన ఓటర్ల జాబితా విడుదల చేశారు. దీంతో కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే ఆశావహులు వార్డుల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉండే వార్డు ఏది, తమ సామాజిక ఓటర్లు ఎక్కడ ఎక్కువగా ఉన్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. పోటీ కోసం తహతహలాడుతున్న ఆశావహులు తమ పార్టీ నేతలను తరచూ కలుస్తున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా కన్పిస్తోంది. ఒక్కొక్క వార్డు నుంచి ముగ్గురు, నలుగురు చొప్పున పోటీకి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. 

పోటాపోటీగా ఓటర్ల నమోదు..
మునిసిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆశావహులు తమకు సంబంధించిన వారిని ఓటర్లుగా నమోదు చేస్తున్నారు. ఓటర్ల జాబితా ప్రకటించినప్పటికీ నూతన ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్‌ మరో అవకాశాన్ని కల్పించింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు సరిగ్గా ఏడు రోజుల ముందు వరకు ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఆశావహులు తమ వార్డుల్లో నూతన ఓటర్లను చేర్పించడం కోసం పోటాపోటీగా దరఖాస్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిని సైతం పట్టణంలోని ఇంటి నంబర్లతో ఓటర్లుగా నమోదు చేయిస్తున్నట్లు సమాచారం. తాము చేర్పించే వారికే ఓటు హక్కు వస్తే తమకు అనుకూలంగా ఫలితం వస్తుందనే ముందుచూపుతో ఓటర్లగా నమోదు చేయించడానికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల కోసం సన్నద్ధం..
మునిసిపాలిటీ ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ సమీక్షను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. రాబోయే మునిసిపాలిటీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కోసం సమాయత్తం అవుతోంది. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలో ఆ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఇప్పటికే బీజేపీ సైతం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల శేఖర్‌ పాల్గొని పార్టీ కార్యకర్తలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేశారు. పార్టీ సమావేశాల్లో ఆశావహులు తమ నేతల మదిలో పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top