'మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి'

Asha Workers Demanding Government To Solve The Problems In Khammam - Sakshi

ఆశా వర్కర్ల డిమాండ్‌

సాక్షి, చుంచుపల్లి(ఖమ్మం) : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆశ కార్యకర్తలు కదం తొక్కారు. నిరంతరం శ్రమదోపిడీకి గురవుతున్నామని, ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన బాట పట్టారు. పలు డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దశలవారీ ఆందోళనల్లో భాగంగా ఈనెల 3వ తేదీన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. 9న తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. 12వ తేదీన జిల్లా కలెక్టర్‌కు, వైద్యశాఖాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. 19, 20 తేదీల్లో కలెక్టరేట్‌ ధర్నాచౌక్‌ల వద్ద, మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

ఈ దీక్షలకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఇక రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం కొత్తగూడెంలోని కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా, ముట్టడి కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత స్థానిక మంచి కంటిభవన్‌ నుంచి భారీ ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ధర్నాచౌక్‌ సమీపంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఛేదించుకొని కలెక్టర్‌ కార్యాలయం వరకు దూసుకెళ్లారు. ఒక్కసారిగా కలెక్టర్‌ కార్యాలయ గేట్లను తొలగించుకొని లోనికి ప్రవేశించారు. ప్రధాన ద్వారం నుంచి ఇంకా లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు పూర్తిగా అడ్డుకున్నారు. ఆ సమయంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.

జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆశ కార్యకర్తలు కార్యాలయం ముందు గంట సేపు బైఠాయించి నినాదాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా పధ్రాన కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నట్లుగా వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని, వేతనాలు అందక పోవడంతో ఆశ వర్కర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

తాము అధికారంలోకి వస్తే ఆశ వర్కర్లకు మెరుగైన వేతనాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్‌.. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నేడు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆశ’లకు రావాల్సిన జీతాలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆశ వర్కర్లకు రూ.10 వేల వేతనం అమలు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీధర్, ఎంవీ అప్పారావు, జాటోత్‌ కృష్ణ, నాయకులు నల్లమల సత్యనారాయణ, ఆశ వర్కర్లు లక్ష్మి, ఈశ్వరి, ఝాన్సీ, ధనలక్ష్మి, లత, పార్వతి, అంజలి, సునిత, కమల, గంగ, పున్నమ్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top