ఆర్మీ రిక్రూట్‌మెంట్‌’ షురూ

Army Recruitment in Malkajgiri From 14th November - Sakshi

నవంబర్‌ 14 వరకు కొనసాగనున్న ప్రక్రియ

వసతులు సక్రమంగా లేవని విమర్శలు

వేల సంఖ్యలో హాజరవుతున్న అభ్యర్థులు

మల్కాజిగిరి: టెరిటోరియల్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ బుధవారం మల్కాజిగిరి మౌలాలిలోని రైల్వే ఇంజినీర్‌ రెజిమెంట్‌ (రైల్వే టెరియర్‌ హెడ్‌ క్వార్టర్స్‌)లో ప్రారంభమైంది. నవంబర్‌ 14 వరకు రిక్రూట్‌మెంట్‌ కొనసాగనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు హాజరు కానున్నారు. సోల్జర్‌ జనరల్‌ క్యాటగిరీ, ట్రేడ్‌మెన్‌కు సంబంధించి దరఖాస్తు చేసిన అభ్యర్థులు వారికి కేటాయించిన రోజుల్లో హాజరు కావాల్సి ఉంటుంది. రోజుకు సుమారు 6,500 మంది పాల్గొనాల్సి ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్ధానిక పోలీసులు లా అండ్‌ ఆర్డర్‌ సమస్య తలెత్తకుండా, ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు అభ్యర్థులకు తాగునీటి వసతి, మొబైల్‌ టాయిలెట్స్‌ వసతి కల్పిస్తున్నారు.

పుట్‌పాత్‌పైనే భోజనం.. 
కానీ..
అధికారులు మొక్కుబడిగానే ఏర్పాట్లు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటి రోజు మహారాష్ట్రకు చెందిన అభ్యర్థులు హాజరయ్యారు. అత్యవసర పరిస్థితిలో అభ్యర్థులకు వైద్య సేవలు అవసరమైతే తరలించడానికి అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. గతంలో ఇలాంటి రిక్రూట్‌మెంట్‌ జరిగినప్పుడు విద్యుత్‌ షాక్‌తో ఓ అభ్యర్థి మృతి చెందడంతో అధికారులు ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరు కానుండటంతో వారికి వసతి కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు తెలిపారు. అభ్యర్థులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌లపైనే నిద్రించడంతో పాటు ఆహారాన్ని కూడా అక్కడే తీసుకుంటున్నారు. పరీక్షలకు హాజరయ్యే రోజు అభ్యర్థులకు టోకెన్లు ముందుగా జారీ చేసి లోనికి అనుమతిస్తున్నామని తెలిపారు. సుమారు 16 రోజులపాటు కొనసాగనున్న రిక్రూట్‌మెంట్‌లో నవంబర్‌ 6వ తేదీ ట్రేడ్‌మెన్‌ విభాగంలో అన్ని రాష్ట్రాలకు చెందిని అభ్యర్థులు హాజరవుతారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top