మా వైఖరి సరైనదే

AP CM YS Jagan Mohan Reddy Meets KCR Discuss Pending Issues - Sakshi

తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌

సామరస్య ధోరణితోనే రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ 

ఈ పని ఎప్పుడో జరిగి ఉండాల్సిందని జగన్‌ వెల్లడి  

ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో జగన్‌ మర్యాదపూర్వక భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: నదీ జలాల విషయంలో తాము ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరి ముమ్మాటికీ సమంజసమైనది, సరైనదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఆయన వెంట ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి ఉన్నారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌–కేసీఆర్‌ మధ్య ప్రధానంగా నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సుహృద్భావ వాతావరణంలో రెండు గంటలకు పైగా చర్చలు జరిగాయి. గోదావరి నదిలో ప్రస్తుతం వెల్లువెత్తిన వరద నీటి అంశం ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. గోదావరిలో పోటెత్తుతున్న వరద గురించి గతంలో జరిగిన చర్చల సందర్భంగా అనుకున్నదే ఇప్పుడు నిజమని తేలుతోందని ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. 

సామరస్యపూర్వక ధోరణితో ముందుకెళ్లాలి 
తెలంగాణలో కొత్తగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్లు పుష్కలంగా వచ్చిన విషయం కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... కృష్ణా, గోదావరి నదుల విషయంలో సామరస్యపూర్వక ధోరణితో ముందుకు వెళితే తప్ప ఉభయ రాష్ట్రాల  ప్రయోజనాలను పరిరక్షించుకోలేమని జగన్, కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం ఉభయ రాష్ట్రాలు తమ సమస్యలపై ఎప్పటి నుంచో సామరస్య ధోరణితో ముందుకు వెళ్లి ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరిగేదని జగన్‌ చెప్పారు. విభజనానంతర సమస్యలపై ఇప్పటికే రెండు రాష్ట్రాల అధికారుల మధ్య జరుగుతున్న చర్చలు, తర్వాత చేపట్టాల్సిన చర్యలపై వైఎస్‌ జగన్, కేసీఆర్‌ మాట్లాడుకున్నారు. వాటిపై ఇదే విధంగా చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రగతి భవనకు చేరుకున్నప్పుడు కేసీఆర్‌ ఎదురేగి ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. భేటీ ముగిసిన అనంతరం జగన్‌ విదేశీ పర్యటన విజయవంతం కావాలని కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.
 

తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ 
నిన్న మొన్నటి దాకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరించి, ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా సేవలందిస్తున్న ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను గురువారం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరిద్దరి మధ్య ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top