అంతరిక్షంలో మరో వింత

Another novelty in space - Sakshi

ఖగోళ పరిభాషలో ‘పెరిహిలియన్‌’  

ప్రమాదం లేదన్న నిపుణులు 

సాక్షి హైదరాబాద్‌: అంతరిక్షంలో మరో వింత చోటు చేసుకోబోతుంది. గురువారం సూర్యుడికి భూమి సమీపంగా చేరబోతుంది. ఖగోళ పరిభాషలో సూర్యుడికి భూమి సమీపంగా వెళ్లటాన్ని పెరిహిలియన్‌ అని, దూరంగా వెళ్లటాన్ని అపిలియన్‌ అని పిలుస్తుంటారు. గురువారం జరిగే ఈ వింతను పెరిహిలియన్‌గా పిలువనున్నారు. సూర్యుడికి భూమి దగ్గరగా, దూరంగా వెళ్లే ప్రక్రియ ఏటా రెండు మార్లు చోటు చేసుకుంటోంది. సూర్యుడి చుట్టూ భూమి దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది. ఈ గమనంలో ఒకసారి సూర్యుడికి సమీపంగా, మరోసారి సూర్యుడికి దూరంగా వెళుతుంది.

జనవరి 3న భూమి సూర్యుడికి సమీపంగా వెళుతుంది. ప్రతి ఏటా ఈ వింత చోటు చేసుకుం టోంది. అయితే జీవుల కంటికి నేరుగా కనిపించని ఈ ఘటన ఖగోళపరంగా చాలా ముఖ్యమైంది. దీని వల్ల వాతావరణంపై ఎటువంటి ప్రభావం ఉండబోదని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు ముఖ్యమైన ఒక అంశాన్ని బోధించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.  

వాతావరణ మార్పులు అపోహే..  
సూర్యుడికి, భూమికి మధ్య దూరం తగ్గటం వలన వాతావరణ మార్పులు వస్తాయనేది అపోహ మాత్రమే అనే విషయాన్ని ఈ ఖగోళ ఘటన ద్వారా రూఢీ చేసుకోవచ్చని ప్లానటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ రఘునందన్‌ కుమార్‌ తెలిపారు. ‘ఈ ఘటనలో భూమి సూర్యుడికి దగ్గరగా వస్తున్నప్పటికీ మనతో సహా ఉత్తర ధృవంలోనూ చలికాలమే కొనసాగుతోంది. జూలైలో భూమి సూర్యుడికి దూరంగా వెళ్లే ఘటన చోటు చేసుకుంటుంది. ఆ సమయంలో మనకు వేసవికాలం. కాబట్టి సూర్యుడికి, భూమికి మధ్య దూరం తగ్గటం వల్ల రుతువులు ఏర్పడతాయని, లేదా వాతావరణ మార్పులు కలుగుతాయనేది అవాస్తవం. దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతున్నప్పుడు భూమి వాలే తీరును బట్టి కాలాలు, రుతువులు ఏర్పడతాయి. ఈ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవడానికి ఈ ఘటనను వారికి చూపించవచ్చు’అని రఘునందన్‌ పేర్కొన్నారు.  

పది రోజులు ఉల్కలు.. 
జనవరి 12 వరకు సూర్యోదయానికి ముందు ఆకాశంలో ఉల్కలను చూసే అవకాశం ఉందని, ముఖ్యంగా 4వ తేదీ నాడు ఈ అవకాశం మరింత ఎక్కువగా ఉందని రఘునందన్‌ తెలిపారు. ఉదయం 3 గంటల నుంచి, తూర్పు, ఈశాన్య దిశల్లో రాలే చుక్కల (ఉల్క)ను చూడవచ్చని చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top